ఆశావహుల్లో తగ్గని అసమ్మతి

ఆశావహుల్లో తగ్గని అసమ్మతి
  •     టికెట్ రాని నేతలను బుజ్జగిస్తున్న అగ్రనేతలు, క్యాండిడేట్లు
  •     కొందరు ససేమిరా అంటున్న అసంతృప్తులు

హైదరాబాద్,వెలుగు : గ్రేటర్​పరిధిలో టికెట్ ఆశించి భంగపడిన పలువురు కాంగ్రెస్​ నేతల్లో అసమ్మతి తగ్గడంలేదు. వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉండగా.. పార్టీ అగ్రనేతలు ఎంత బుజ్జగించినా  ససేమిరా వినడంలేదు. టికెట్ రాకపోవడంపై కొందరు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరికొందరు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పార్టీ టికెట్ దక్కిన అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.  

సెగ్మెంట్​ లో అసమ్మతి నేతలు కలిసి పని చేస్తారో లేదోననే టెన్షన్ మొదలైంది. కొందరు అభ్యర్థులు నేరుగా అసంతృప్త నేతల వద్దకు వెళ్లి మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.  అధికారంలోకి రావడమే ధ్యేయంగా పార్టీ పని చేస్తుంటే కిందిస్థాయిలో ఇలాంటి అసమ్మతులు పార్టీకి నష్టం చేస్తారని సీనియర్లు కూడా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సిటీలోని జూబ్లీహిల్స్, సనత్​నగర్, అంబర్​పేట, మలక్ పేట, ఎల్​బీ నగర్​ స్థానాల్లో టికెట్​ఆశించిన స్థానిక నేతలు పార్టీపై గుర్రుగానే ఉన్నారు. 

పార్టీని నమ్ముకుని ఉంటే.. 

 పార్టీని నమ్ముకుని ఏళ్లుగా కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రావడం లేదని టికెట్​ఆశించిన  నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్​టికెట్​తనకు ఇవ్వకపోవడంతో  పీజేఆర్​తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​రెడ్డి పార్టీపై ఆరోపణలు చేశారు. తనకు కాదని మాజీ క్రికెటర్​అజారుద్దీన్ కు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  జూబ్లీహిల్స్​నుంచి పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మలక్​పేట నుంచి షేక్​అక్బర్​కు టికెట్​ కేటాయించడంపై కాంగ్రెస్​మైనారిటీ సెల్​చైర్మన్​షేక్​అబ్దుల్లా సోహెల్​మండిపడ్డారు. పార్టీలో ఏళ్లుగా పని చేస్తున్నా గుర్తింపు లేదని వాపోయారు. అంబర్​పేట పార్టీ సీనియర్​ నేత లక్ష్మణ్​యాదవ్​, యువ నేత నూతి శ్రీకాంత్​ టికెట్​ఆశించారు. వారిని కాదని పీసీసీ నేత రోహిణ్​రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు.

దీంతో టికెట్​దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో ఉండి  తమ భవిష్యత్​కార్యాచరణ నిర్ణయించుకునే పనిలో ఉంటామని పేర్కొంటున్నారు.  సనత్​నగర్​నుంచి టికెట్​ఆశించిన మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనవడు ఆదిత్యరెడ్డిని కాదని కోట నీలిమకు ఇచ్చారు. తన తాత, తండ్రి కాంగ్రెస్​కు ఎంతో సేవ చేశారని, అయినా తనను పార్టీ గుర్తించలేదని ఆదిత్యరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే బీసీ నేతలు డాక్టర్​రవీందర్​గౌడ్​, విష్ణువర్ధన్​నాయుడు కూడా టికెట్లు ఆశించినా.. వారిని పార్టీ గుర్తించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

అభ్యర్థుల సంప్రదింపులు

 టికెట్ ఆశావహులను అభ్యర్థులు నేరుగా సంప్రదించి తమకు సహకరించాలని కోరుతున్నారు. పార్టీ అగ్రనాయకులు సైతం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అసంతృప్త నేతలు చల్లబడుతున్నా.. చాలా మంది ఆగ్రహంతోనే ఉన్నారు. ముషీరాబాద్​ టికెట్​ఆశించిన పీసీసీ నేత నగేశ్​ ముదిరాజ్​ను కాదని మాజీ ఎంపీ అంజన్​ కుమార్​యాదవ్​ కు కేటాయించారు. దీంతో నగేశ్​ ముదిరాజ్​అసంతృప్తిని గుర్తించి అంజన్​ కుమార్​ఆయనను బుజ్జగించి తన వైపు తిప్పుకున్నారు.

అలాగే ఎల్​బీ నగర్​లోనూ స్థానిక  నేతలు, అసంతృప్తులతో అభ్యర్థి మధుయాష్కి గౌడ్ సంప్రదింపులు చేస్తున్నారు. సిటీలోని పలు స్థానాల్లో కాంగ్రెస్ ​టికెట్​ ఆశించిన వారిలో కొందరు బుజ్జగింపులకు చల్లబడితే మరికొందరు పార్టీపై ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు.