
- 42% కోటాను అడ్డుకునేందుకు తెరవెనుక కుట్రలు పన్నారని ఫైర్
- రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- రిజర్వేషన్ల సాధన కోసం నేడు ఉద్యమ కార్యాచరణ
- 13న నేషనల్ హైవేల దిగ్బంధం.. 14న రాష్ట్ర బంద్
- ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని అన్ని పార్టీల్లోనూ ఆందోళన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం హీటెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 9కి వ్యతిరేకంగా హైకోర్టులో కొందరు పిటిషన్లు వేయడం, ఈ క్రమంలో కోర్టు స్టే ఇవ్వడంతో.. తమ నోటికాడి ముద్దను లాక్కున్నారని బీసీ నేతలు మండిపడుతున్నారు. జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న తమకు ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొంతమంది జీర్ణించుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీల తీరును బీసీ నేతలు ఎక్కడికక్కడ ఎండగడ్తున్నారు.
ఈ క్రమంలోనే బీసీ సంఘాల ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దీంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. కాగా, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం హైదరాబాద్ వేదికగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్టు బీసీ నేతలు వెల్లడించడంతో అగ్గి రాజుకున్నట్టయింది. జనాభాలో సగానికి పైగా బీసీలే ఉన్నారని చెప్పడమే తప్ప గత ప్రభుత్వాలు ఏనాడూ బీసీలను ప్రత్యేకంగా లెక్కించలేదు. ఈ క్రమంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా కాంగ్రెస్సర్కార్ బీసీల లెక్కలను శాస్త్రీయంగా తేల్చేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో బీసీ జనాభా 57.6 శాతం ఉన్నట్టు తేలింది.
దీనిని పరిగణనలోకి తీసుకొని విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రెండు బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పాటు గత కేసీఆర్సర్కారు తెచ్చిన పంచాయతీరాజ్చట్టంలోని 285(ఏ)ను సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్తెచ్చింది. కానీ ఈ బిల్లులను రాష్ట్రపతి పెండింగ్పెట్టడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో 9ని జారీ చేసింది. ఆ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్రిలీజ్చేసింది. తొలి విడత నోటిఫికేషన్కూడా రావడంతో బీసీలంతా ఖుష్ అయ్యారు. చరిత్రలో మొదటిసారి 42శాతం పదవులు దక్కబోతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ రిజర్వేషన్ల శాతం 50% మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పుకు ఈ జీవో విరుద్ధమంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు రిజర్వేషన్ల శాతం నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు సూచించిన ‘ట్రిపుల్ టెస్ట్’ పాటించలేదని వారు వాదించారు. బీసీల్లోని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఏ,బీ, సీ, డీ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ క్రమంలో 42 శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు బీసీల రాజకీయ భవిష్యత్ పూర్తిగా న్యాయవ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది.
పార్టీలపై బీసీల గుస్సా
రిజర్వేషన్ల అంశాన్ని కోర్టులో సవాల్ చేయడం వెనుక రాజకీయ పార్టీల నేతల హస్తం ఉందని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. 57.6 శాతం జనాభా ఉన్న తమకు కేవలం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జీర్ణించుకోలేకపోవడాన్ని తప్పుపడ్తున్నారు. హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు కొనసాగిస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధావులు, విద్యార్థి సంఘాల లీడర్లు.. రాజకీయ పార్టీల తీరు, నేతల వైఖరిని ఎక్కడికక్కడ ఎండగడ్తున్నారు. అన్ని పార్టీల నేతలు అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇచ్చినా, తెరవెనుక కుట్రలు పన్నారని, దాని ఫలితంగానే రిజర్వేషన్లపై స్టే వచ్చిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల రాజ్యాంగ రక్షణకు షెడ్యూల్9లో చేర్చాల్సి ఉండగా, ఇందుకు ప్రధాన పార్టీలేవీ సీరియస్‌గా ప్రయత్నించలేదని విమర్శిస్తున్నారు. బిల్లులను ముందు గవర్నర్, తర్వాత రాష్ట్రపతి తమ వద్ద పెండింగ్పెట్టుకున్నా బీజేపీ లీడర్లు వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదని మండిపడుతున్నారు.
పైగా బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్హామీ ఇచ్చినందున.. ఆ విషయం తమకు సంబంధం లేనట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని, బయటకు మద్దతు తెలిపినా ఎక్కడ కాంగ్రెస్‌కు పేరు వస్తుందోనని లోలోపల రిజర్వేషన్లు అమలుకాకుండా కుట్ర పన్నారని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు కాంగ్రెస్సర్కారు తీరునూ కొందరు తప్పుపడ్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించలేమని, అదే సమయంలో సర్కారు చేసిన కొన్ని పొరపాట్లు బీసీ వ్యతిరేకులకు కలిసి వచ్చాయని చెప్తున్నారు. ఉదాహరణకు పంచాయతీరాజ్చట్ట సవరణకు ఆర్డినెన్స్ చేసిన ప్రభుత్వం.. దాన్ని గవర్నర్ఆమోదానికి పంపిన నెల రోజులకే జీవో 9 జారీ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో విషయం కాస్తా పక్కదారి పట్టిందని, హైకోర్టులో రిజర్వేషన్లపై కాకుండా జీవో రాజ్యాంగబద్ధతపై పిటిషనర్ల తరఫు అడ్వొకేట్లు వాదించే అవకాశాన్ని సర్కారే ఇచ్చినట్లయిందని బీసీ లీడర్లు విమర్శిస్తున్నారు.