ఆర్టీసీ సమ్మె: అటు ఆందోళనలు..ఇటు అరెస్టులు

ఆర్టీసీ సమ్మె:  అటు ఆందోళనలు..ఇటు అరెస్టులు
  • ఆరో రోజుకు ఆర్మీసీ కార్మికుల సమ్మె
  •  జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు ఉధృతం
  • ఎక్కడికక్కడ అరెస్టులు..కొన్ని చోట్ల లాఠీ చార్జ్‌‌
  • సమ్మెతో తిరుగు ప్రయాణంలో జనాలకు తిప్పలు
  • ప్రత్యామ్నాయాలు సాల్తలేవు..ప్రైవేటులో ‘బాదుడు’ 
  • బస్సుల్లో పాస్‌‌లకు నో ఎంట్రీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం ఆరో రోజుకు చేరింది. తమ డిమాండ్లపై సర్కారు దిగిరాకపోవడంతో కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రాస్తా రోకోలతో హోరెత్తించారు. డిపోల వద్ద 144 సెక్షన్‌‌ ఉండటంతో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. వరంగల్‌‌, మహబూబ్‌‌నగర్‌‌ లాంటి చోట్ల పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

రాష్ట్రమంతా నిరసనలు

హైదరాబాద్‌‌లోని ఎంజీబీఎస్‌‌, జేబీఎస్‌‌లో పెద్ద ఎత్తున కార్మికులు నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌‌లో మోకాళ్లపై నడుస్తూ భిక్షాటన చేశారు. గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్‌‌ జిల్లాల్లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్యర్యంలో డిపోల వద్ద ధర్నాలు చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో కార్మికులకు సంఘీభావం తెలిపిన టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దివ్యాంగులు నిరసన తెలిపారు. మంచిర్యాల డిపో ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్‌‌లో నిర్బంధించారు. ఆందోళనలు విరమించుకోకపోతే సర్కారు ఆదేశాల మేరకు కేసులు పెడతామని హెచ్చరించారు.

ప్రయాణికులకు చుక్కలు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టెన్త్‌‌ పాసైన వారిని కండక్టర్‌‌గా, డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌ ఉన్నవారిని డ్రైవర్‌‌గా తాత్కాలికంగా సర్కారు తీసుకుంటోంది. దీంతో డిపోల వద్ద నిరుద్యోగులు బారులు తీరుతున్నారు. కొంత మంది తాగి డ్రైవింగ్‌‌కు వస్తున్నారని, వాళ్లను పంపించేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసినా చాలడం లేదు. దీంతో దసరాకు తిప్పలు పడుతూనే ఊరెళ్లిన ప్రజలు రావడానికి మరింత ఆపసోపాలు పడుతున్నారు. ప్రైవేటోళ్లు ఆర్టీసీ చార్జీల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు. గురువారం 5,580 బస్సులు నడిపామని, వీటిలో 3,540 ఆర్టీసీలు బస్సులు, 2,040 అద్దె బస్సులని అధికారులు తెలిపారు. 6 వేలకు పైగా ప్రైవేట్‌‌ వాహనాలూ నడిచాయన్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో పాస్‌‌లకు అనుమతివ్వడం లేదు. బస్సు నంబర్‌‌ ప్లేట్ పక్కనే కొత్తగా ‘నో పాస్‌‌’ అని బోర్డులు పెడుతున్నారు. కాగా, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడాల్సి ఉన్నా పదో తేదీ దాటినా అందలేదు.

మహిళా కార్మికులని చూడకుండా..

వరంగల్‍ జిల్లా కేంద్రంలో ఆందోళన చేసిన ఆర్టీసీ మహిళా కార్మికులపై కాజీపేట పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. గురువారం హన్మకొండ బస్టాండ్‍ నుంచి అదాలత్‍ జంక్షన్‍లోని అమరవీరుల స్థూపం వద్దకు కార్మికులు ర్యాలీగా బయలుదేరారు. వాళ్లను ఏకశిల పార్కు వద్ద బారికేడ్లతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా దాటుకుని స్థూపం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే కూర్చొని నినాదాలు చేశారు. అరెస్టు చేయడానికి వచ్చిన ఏసీపీ నర్సింగరావు, సీఐ సదయ్య, ఇతర పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కార్మికులు మండిపడ్డారు. మగ పోలీసుల తీరును ప్రశ్నించిన మహిళలపై తిట్ల పురాణం అందుకున్నారు. అడ్డొస్తే యూనియన్‌‌ నేతల సంగతి చూస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులను వాహనాళ్లోకి ఈడ్చి పడేశారు. దీంతో కొందరికి గాయాలవగా చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు.

గుండె ఆగి ఇద్దరు కార్మికులు మృతి

ఇద్దరు ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో గురువారం మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బాంబే కాలనీకి చెందిన షేక్​ ఖలీల్ మియా (48).. 16 ఏళ్లుగా హెచ్‌‌సీయూ డిపోలో డ్రైవర్‌‌గా పని చేస్తున్నాడు. బుధవారం డిపో దగ్గర జరిగిన ర్యాలీలో పాల్గొని వెళ్లిన ఖలీల్‌‌ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఇంట్లో మృతి చెందాడు. జాబ్ పోయేలా ఉందని ఖలీల్‌‌ ఆవేదన చెందాడని కుటుంబీకులు చెప్పారు. మరో ఘటనలో భువనగిరి జిల్లా చెంగిచెర్ల డిపోలో డ్రైవర్‌‌గా పని చేస్తున్న దొడ్డి కొమురయ్య (57) గురువారం డిపో దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొని ఇంటికెళ్లగానే కుప్పకూలిపోయాడు. దగ్గర్లోని ప్రైవేటు హాస్పిటల్‌‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఉద్యోగం నుంచి డిస్మిస్‌‌ అయ్యారని సర్కారు ప్రకటించినప్పటి నుంచి కొమురయ్య ఆందోళనగా ఉన్నాడని, తన చావుకు ప్రభుత్వమే కారణమని జేఏసీ నేతలు ఆరోపించారు. కొమురయ్య మృతదేహంతో డిపో ముందు శుక్రవారం ఆందోళన చేస్తామన్నారు.

మరిన్ని ప్రమాదాలు

తాత్కాలిక డ్రైవర్లు నడుపుతున్న బస్సుల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ టెంపరరీ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు యాక్సిడెంట్ జరిగింది. నర్సు శోభను బస్సు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామం దగ్గర గొర్రెల మందపైకి బస్సు దూసుకెళ్లింది. గొర్రెల కాపరికి ప్రాణాపాయం తప్పింది. 15 గొర్రెలు మృతిచెందాయి. మేడ్చల్ ఇండ్రస్ట్రియల్ ఏరియా దగ్గర పోలీస్ పెట్రోలింగ్ వాహనం యూటర్న్ చేసుకుంటుండగా కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ పెట్రోలింగ్ వెహికల్‌‌ ముందున్న కారును ఢీ కొనడంతో కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.