జాతీయ మత్స్య బోర్డు ఏపీకి తరలించే కుట్ర .. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లెటర్ !

జాతీయ మత్స్య బోర్డు ఏపీకి తరలించే  కుట్ర .. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లెటర్ !
  • దానివల్ల మన రాష్ట్ర మత్స్యకారులకు నష్టం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీబీ)ను ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని అమరావతికి తరలించేందుకు ఏపీ సీఎం  చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ చర్య తెలంగాణ మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. 2006లో హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటైన ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీబీ, దేశవ్యాప్తంగా మత్స్య రంగ అభివృద్ధికి ప్రధాన కార్యాలయంగా వ్యవహరిస్తోంది. దేశంలో మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. 

అయినప్పటికీ, ఈ బోర్డును అమరావతికి తరలించాలని చంద్రబాబు పట్టుబడుతున్నారని, దీని వెనుక తెలంగాణ రాష్ట్రాన్ని అణచివేయాలనే ఉద్దేశం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో చేపలు, రొయ్యల చెరువులు పెద్దగా లేకపోయినా, ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీబీ హైదరాబాద్‌‌‌‌లోనే ఉండాలని రాష్ట్ర విభజన సమయంలో నిర్ణయించారు. శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టు మార్గంలో చేప ఆకారంలో ఉన్న ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీబీ భవనం ఈ రంగ అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తోంది. 

ఈ బోర్డు ఏపీకి తరలిపోతే, తెలంగాణలోని మత్స్యకారులకు సాంకేతిక, ఆర్థిక సహాయం, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు దూరమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.“ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీబీ తరలింపు తెలంగాణ మత్స్య రంగానికి తీరని నష్టం కలిగిస్తుంది. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు,” అని ఓ మత్స్యకార సంఘం నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరలింపు ప్రతిపాదనను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నరు.