శ్రీలంకలో డీజిల్​ నిల్ 

శ్రీలంకలో డీజిల్​ నిల్ 

కొలంబో: తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా డీజిల్​ అమ్మకాలను ఆయిల్​ కంపెనీలు నిలిపేశాయి. దీంతో రవాణా సేవలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు.. డీజిల్​ లేకపోవడంతో దాదాపు 2 కోట్ల మంది జనం కరెంట్ సరఫరా లేక చీకట్లో మగ్గుతున్నారు. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇదే. నిత్యావసర వస్తువుల దిగుమతులకు అవసరమైన విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.

అడుగంటిన ఆయిల్​ నిల్వలు

ప్రస్తుతం బస్సులు, కమర్షియల్​ వెహికల్స్​ ట్రాన్స్​ పోర్ట్​కు అవసరమైన డీజిల్​ నిల్వలు అడుగంటినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో గురువారం దేశవ్యాప్తంగా డీజిల్​ అమ్మకాలను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. పెట్రోల్​ మాత్రం అమ్ముతున్నా.. అది కూడా చాలా తక్కువ మొత్తంలోనే నిల్వ ఉన్నట్టు సమాచారం. దీంతో పెట్రోల్​ బంకుల దగ్గర కార్లు బైకులను క్యూలో పెట్టి వాహనదారులు వెళ్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహన దారులు మెయిన్​ రోడ్లను బ్లాక్​ చేసి నిరసన తెలుపుతున్నారు. కాగా, గురువారం నుంచి 13 గంటల పాటు కరెంట్​ కోతలను అమలు చేస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వ రంగ 
విద్యుత్​ సంస్థ ప్రకటించింది.

రాజపక్స ఇంటి ముందు అర్ధరాత్రి జనం ఆందోళన

తినడానికి తిండి లేక, నిత్యావసరాల కొరతతో విసిగిపోయిన ప్రజలు ప్రెసిడెంట్​ గోటబయ రాజపక్సపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి కొలంబోలోని ఆయన​ ఇంటిముందు ఆందోళన చేశారు. రెండు వేల మంది ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వారిని అదుపుచేయడానికి పోలీసులు వాటర్​ కేనన్​లు ప్రయోగించడంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులపైకి  జనం రాళ్లు విసిరారు. ఓ బస్సును ధ్వంసం చేశారు.