హైదరాబాద్, వెలుగు: షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను డ్యూటీలోకి చేర్చుకునే ప్రసక్తి ఉండదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కార్మిక సంఘాలపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని అంటున్నాయి. ‘కచ్చితంగా కండిషన్స్ ఉంటాయి. ఎందుకు సమ్మెకు వెళ్లామా అనే తీరుగా ఆ కండిషన్స్ ఉంటాయి’ అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. ప్రతి కార్మికుడు లిఖితపూర్వకంగా షరతులను ఆమోదించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇక నుంచి సమ్మె చేయబోమని, సమ్మె కాలానికి జీతం అడగబోమని, సంస్థను విలీనం చేయాలంటూ కోరబోమని,
అదే సమయంలో ఆర్థిక పరమైన అంశాలను కూడా భవిష్యత్ లో అడగబోమనే విధంగా కండిషన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విధించనున్నట్లు తెలిసింది.
ఎట్ల చేరాలో కూడా వాళ్లే చెప్తరా?: సీఎం!
ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడిన అంశాలపై, పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులతో ఆరా తీసినట్లు సమాచారం. ‘సమ్మె చేయడం వాళ్ల ఇష్టమే. డ్యూటీలో ఎట్ల చేరాలో కూడా వాళ్లే చెప్తరా?’ అని సీఎం అన్నట్టు తెలిసింది. సమ్మె ఇంత దూరం వచ్చాక షరతులు లేకుండా ఎట్ల డ్యూటీలోకి తీసుకుంటారనే తీరుగా ఆయన మాట్లాడినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల అంశంపై గురువారం సీఎం కేసీఆర్ సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మరిన్ని వార్తల కోసంhttps://epaper.v6velugu.com/2427226/V6-Prabhatha-Velugu-Telugu-Daily-Newspaper/22-11-19#page/2/1
