హైదరాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య ఆరోగ్య సిబ్బంది అండగా నిలవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సిబ్బంది జ్వర సర్వే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా మలేరియా, డెంగీలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైరల్ ఫీవర్ నివారణకు ఇంటింటికి తిరిగి జ్వర సర్వే నిర్వహించి బాధితులకు అవసరమైన మందులను అందజేయాలని మంత్రి అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. జ్వర సర్వే చేసి ప్రతిరోజు హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక పంపించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.
