మోడల్ స్కూల్స్ టీచర్ల బదిలీలపై అయోమయం

మోడల్ స్కూల్స్ టీచర్ల బదిలీలపై అయోమయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ఉత్వర్వుల ప్రకారం సొంత జిల్లాలు, జోన్లకు వివిధ డిపార్ట్​మెంట్ల ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. కానీ విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూళ్లలో ఆ ప్రక్రియ ఇంకా స్టార్ట్​ కాలేదు. త్వరలోనే మోడల్ స్కూళ్ల టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు అంటూ సర్కారు పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో తమ సొంత జిల్లాలు, జోన్లకు అలాట్ కాకముందే బదిలీలు ఎలా చేస్తారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క జీవో317తో సంబంధం లేకుండా బదిలీచేస్తే, సమస్యలు వచ్చే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. దీంతో జీవో అమలు చేయాలా? లేదా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. 

ఎప్పుడు చేస్తరో..  

రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లుండగా, వాటిలో టీచింగ్ 3,880, నాన్​  టీచింగ్​లో 776  శాంక్షన్డ్ పోస్టులున్నాయి. ప్రస్తుతం 2,872 మంది ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ కేడర్​లో టీచింగ్ స్టాఫ్ పని చేస్తున్నారు. నాన్ టీచింగ్​లోని పీడీ, డేటా ఎంట్రీ, ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్ మెన్ తదితర పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. అయితే 2013లో టీచర్ల రిక్రూట్మెంట్ టైమ్​లో ప్రిన్సిపాల్ పోస్టులు స్టేట్ కేడర్​లో ఉండగా, పీజీటీ, టీజీటీ పోస్టులు జోన్ పోస్టులుగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లుగా కేడర్​ను ప్రభుత్వం విభజించింది. జీవో317 ప్రకారం ప్రస్తుతం కేడర్ విభజన జరుగుతోంది. దీని ప్రకారం మోడల్ స్కూళ్లలోని ఎంప్లాయీస్​ కేడర్​నూ విభజించాలి. కానీ ప్రభుత్వం ఆ పని ఇంకా చేయలేదు. ఎప్పుడు చేస్తారనే దానిపైనా సర్కారు పెద్దలు, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. స్టేట్ కేడర్​ పోస్టులను రద్దు చేయడంతో ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టులను మల్టీజోన్ పోస్టులుగా, టీజీటీ పోస్టులను జోన్ పోస్టులుగా మార్చే ఆలోచనలో అధికారులున్నట్టు తెలిసింది.  

బదిలీలపై అయోమయం..  

మల్టీజోన్ 1 పరిధిలో 117 మోడల్​ స్కూళ్లు ఉండగా, మల్టీజోన్ 2 కింద 77 ఉన్నాయి. వాటిల్లో పనిచేస్తున్న టీచింగ్ కేడర్​ను ముందుగా సొంత జోన్లు, మల్టీజోన్లకు అలాట్ చేయాలి. అలా చేయకుండా ముందే బదిలీలు చేస్తే లీగల్​గా సమస్యలు వచ్చే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సొంత జోన్లకు పంపించకుండా, కొత్త పోస్టులను భర్తీ చేయడం కష్టమేనని అంటున్నారు. అయితే జనరల్ బదిలీలు చేసిన తర్వాత, జీవో 317 అమలు చేస్తే రెండోసారి టీచర్లు బదిలీ కావాల్సి ఉంటుంది. దీనివల్ల టీచర్ల జిల్లాలు మారిపోయే అవకాశముంది. ఇదేదీ పట్టించుకోని సర్కారు పెద్దలు త్వరలోనే మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టీచర్ల సంఘాలు కలిసిన సమయంలోనూ ఇదే విషయాన్ని చెప్పినట్టు పలు సంఘాల లీడర్లు చెప్పారు. కొందరు అధికారులు మాత్రం సొసైటీలు, బోర్డులకు జీవో317తో సంబంధం లేదని చెప్తున్నారు. దీంతో స్పష్టత ఇవ్వాలని సర్కారును విద్యాశాఖ అధికారులు కోరారు.