గందరగోళంగా రాష్ట్ర విద్యావ్యవస్థ

గందరగోళంగా రాష్ట్ర విద్యావ్యవస్థ
  • యథేచ్ఛగా అడ్మిషన్లు.. లక్షలకు లక్షలు ఫీజులు
  • గుర్తింపులేని 680 ఇంటర్ కాలేజీల్లో లక్షన్నర మంది స్టూడెంట్లు 
  • అఫిలియేషన్ లేకుండానే నడుస్తున్న వందల స్కూళ్లు 
  • మూసివేయకుండా వాటికే సర్కారు వత్తాసు 
  • ప్రశ్నార్థకంగా మారుతున్న స్టూడెంట్ల భవిష్యత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గందరగోళంగా తయారైంది. పర్మిషన్ లేకుండా స్కూళ్లే కాదు ఏకంగా ప్రైవేటు యూనివర్సిటీలు నడుస్తున్నాయి. రూల్స్​కు విరుద్ధంగా ఆ సంస్థల యాజమాన్యాలు ప్రచారం చేస్తూ.. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ స్టూడెంట్లను జాయిన్​ చేసుకుంటున్నాయి. ఇలాంటి వర్సిటీల్లో చేరుతున్న స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ యూనివర్సిటీల్లో కనీస వసతులు కూడా ఉండటం లేదు. పాత బిల్డింగ్స్​కే రంగులు వేసి కొత్త  బిల్డింగ్స్​గా చెప్పి మేనేజ్​ చేస్తున్నారు. మరోవైపు గుర్తింపు లేకుండా వందలాది ఇంటర్మీడియెట్​ కాలేజీలు, స్కూళ్లు నడుస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది. 

ఆమోదం లేకపోయినా..!

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు కోసం నాలుగేండ్ల కింద ‘తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీల చట్టం–2018’ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 2020–21లో ఐదు వర్సిటీలకు అనుమతించింది. వీటిలో మహింద్రా యూనివర్సిటీ, వోక్సెన్‌‌ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎస్‌‌ఆర్‌‌ యూనివర్సిటీ, అనురాగ్‌‌ యూనివర్సిటీ ఉన్నాయి. వీటికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో పర్మిషన్​ ఉంది. అయితే.. ఈ ఏడాది సెప్టెంబర్​లో మరో ఐదు వర్సిటీల ఏర్పాటు కోసం ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని మారుస్తూ అసెంబ్లీలో రాష్ట్ర సర్కారు బిల్లు తెచ్చింది. వీటిలో గురునానక్ వర్సిటీ (ఇబ్రహీంపట్నం), శ్రీనిధి వర్సిటీ (ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌), ఎంఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ వర్సిటీ (సంగారెడ్డి), నిక్‌‌‌‌మర్‌‌‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌ కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ (శామీర్‌‌‌‌పేట), కావేరి యూనివర్సిటీ (గౌరారం, సిద్దిపేట) ఉన్నాయి. ఈ ఐదు వర్సిటీలకు సంబంధించిన బిల్లు ఇంకా పూర్తిస్థాయిలో ఆమోదం పొందలేదు. గెజిట్​ నోటిఫికేషన్​ రాలేదు. కానీ, వర్సిటీలు మాత్రం తమ కార్యకలాపాలను బిల్లు ప్రవేశపెట్టకముందు నుంచే స్టార్ట్​చేశాయి. 

ఆశలు చూపెట్టి అడ్మిషన్లు.. 

సెప్టెంబర్​లో ప్రకటించిన ఐదు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఇంకా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినా.. గురునానక్​, శ్రీనిధి, ఎంఎన్​ఆర్, నిక్ మార్ వర్సిటీల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్టు ఆయా వర్సిటీ వెబ్ సైట్లలో పేర్కొన్నారు. గురునానక్​ వర్సిటీలో దాదాపు 2వేల అడ్మిషన్లు అయ్యాయని, క్లాసులు నడుస్తున్నాయని అధికారులే  చెప్తున్నారు. శ్రీనిధి వర్సిటీలో బీటెక్ కోర్సులతో ఈ ఏడాది మొదలుపెట్టగా, 800 వరకూ అడ్మిషన్లు అయినట్లు అధికారులు అంటున్నారు. నిక్ మార్​లో ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సులను మొదలుపెట్టారు. ఎంఎన్​ఆర్ వర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తున్నది. ఈ ప్రైవేట్​ వర్సిటీల్లో కొన్ని అసెంబ్లీలో బిల్​ పాస్ కాకముందు నుంచి అంటే నాలుగైదు నెలల ముందు నుంచే తమ వర్సిటీల్లో చేరాలంటూ ప్రచారం ప్రారంభించాయి. ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు ఆశలు కల్పించి చేర్చుకుంటున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్నాయి. 

బిల్డింగ్స్​ కూడా సక్కగ లేవు

సరైన వసతులు, పూర్తిస్థాయి బిల్డింగ్స్​ ఉంటేనే వర్సిటీలకు పర్మిషన్​ ఇస్తారు. కానీ ఏ వర్సిటీకి కూడా బిల్డింగ్స్​ లేవు. ఇప్పటికే ఉన్న తమ కాలేజీల భవనాలనే వర్సిటీ బిల్డింగ్​లుగా తనిఖీల సమయంలో చూపిస్తున్నట్లు తెలిసింది.  ఉన్న కాలేజీల్లోని స్టాఫ్​నే, వర్సిటీ స్టాఫ్​గా చెప్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కావేరీ వర్సిటీకీ ఏ బిల్డింగ్​  కూడా లేదు. ఇలాంటి వర్సిటీల్లో చేరితే.. పర్మిషన్ ఎప్పుడు వస్తుందో రాదో తెలియక విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుందని, వర్సిటీల పట్టా చెల్లకుండా పోతుందని  విద్యావేత్తలు అంటున్నారు. ​

అప్​గ్రేడ్​ చేసి వదిలేసింది

130 వరకు కేజీబీవీ, మోడల్ స్కూల్స్​, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను ఈ ఏడాది ఇంటర్​కు ప్రభుత్వం అప్​గ్రేడ్​చేసింది. అయితే వాటికీ ఈ ఏడాది ఇంటర్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు. దీంట్లో వాటిలో అడ్మిషన్​ పొందిన విద్యార్థుల పరిస్థితి అగమగ్యగోచరంగా మారింది.

 

 

680 ఇంటర్ కాలేజీలకు గుర్తింపు లేకున్నా..!

రాష్ట్రంలో సుమారు 680 జూనియర్ కాలేజీలు గుర్తింపులేకుండానే నడుస్తున్నాయి. వీటిలో 450 వరకు ప్రైవేటు కాలేజీలకు నాలుగైదేండ్లుగా ఫైర్ సెఫ్టీ లేదు. అయితే.. ప్రభుత్వం మాత్రం వీటికి ఏటా కండిషన్ పర్మిషన్  ఇస్తూ కొనసాగిస్తున్నది. ఈ ఏడాది కూడా ఇదే సమస్య ఎదురైంది. నిబంధనల ప్రకారం అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్న సుమారు లక్షన్నర మంది స్టూడెంట్లను ప్రైవేటుగా రాసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ముందే వీటిని ‌‌‌‌‌‌‌‌మూసేస్తే.. ఈ పరిస్థితి రాకపోయేదని పేరెంట్స్, స్టూడెంట్లు అంటున్నారు. 

గుర్తింపులేని ప్రైవేటు స్కూళ్లపై చర్యలేవి?

రాష్ట్రంలో వందలాది ప్రైవేటు స్కూళ్లు గుర్తింపు లేకుండానే నడుస్తున్నాయి. వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.  ఇటీవల హైదరాబాద్​లోని డీఏవీ స్కూల్​లో చిన్నారిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనతో..  ఆ స్కూల్​లో  పర్మిషన్ లేకుండానే 6,7 తరగతులు నడుస్తున్నట్లు తేలింది. కార్పొరేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా.. అధికారులు ఏనాడూ తనిఖీ చేయడం లేదు. 

ఆ వర్సిటీలపై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండా ఎట్లా క్లాసులు ప్రారంభిస్తారు. యూజీసీ ప్రైవేటు వర్సిటీ రెగ్యులేషన్ -2003, తెలంగాణ ప్రైవేటు వర్సిటీ యాక్ట్​లోని నిబంధనలూ అమలు చేయడం లేదు. ఉన్న అటానమస్ కాలేజీలోనే యూనివర్సిటీలు నడిపితే పర్మిషన్ ఇస్తరా? అనుమతులు లేకున్నా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా అడ్మిషన్లు తీసుకున్న ఆయా వర్సిటీలపై చర్యలు తీసుకోవాలి. 

- సంతోష్​ కుమార్, టీఎస్టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రైవేటు వర్సిటీ పర్మిషన్ ఇవ్వొద్దు

రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటును ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ఐదు వర్సిటీలకు పర్మిషన్ ఇచ్చారు. ఇంకో ఐదింటికి పర్మిషన్ రాకముందే, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్లు తీసుకోవడం సరికాదు. ప్రస్తుతం నడుస్తున్న ఆయా ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. సర్కారు వర్సిటీలకు నిధులిచ్చి, వాటిలోని సమస్యలను పరిష్కరించాలి. 

- ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు