గ్రూప్1 ప్రిలిమ్స్ రిజల్ట్​పై అభ్యర్థుల్లో ఇంకా అయోమయం

గ్రూప్1 ప్రిలిమ్స్ రిజల్ట్​పై అభ్యర్థుల్లో ఇంకా అయోమయం
  • మెయిన్స్​కు ఎంపికైన వారి హాల్​టికెట్ల నంబర్లు విడుదలచేసిన టీఎస్పీఎస్సీ 
  • ఫలితాలొచ్చి ఐదురోజులైనా.. మార్కులు, కమ్యూనిటీ డీటెయిల్స్ పై నో క్లారిటీ 
  • జెండర్ వైజ్​ డీటెయిల్స్ కూడా ఇవ్వని కమిషన్​
  • హారిజాంటల్​ విధానంలో ఎంపిక చేసినట్టు ప్రకటన 

హైదరాబాద్, వెలుగు:  గ్రూప్1 ప్రిలిమ్స్ ఫలితాలపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఎంతో ఆశతో పరీక్ష రాస్తే కనీసం మార్కులు ఎన్ని వచ్చాయో కూడా టీఎస్​పీఎస్సీ ప్రకటించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కులు, కమ్యూనిటీ, జెండర్ డీటెయిల్స్ ఇలా ఏవీ లేకపోవడంతో, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే పికప్ లిస్టులో ఏ కేటగిరిలో.. ఎంత కటాఫ్​అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మెయిన్స్ కు ఎంపికైన వారి హాల్​టికెట్ల నెంబర్లను టీఎస్పీఎస్సీ వెబ్​సైట్లో పెట్టింది. దీనిపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

ఒక్కో పోస్టుకు 50మందిని..

రాష్ట్రంలో 503  గ్రూప్ –1 పోస్టుల భర్తీకి  అక్టోబర్16న టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించింది. ఈ పరీక్ష కోసం 3 ,80,204 మంది అప్లై చేసుకోగా,  2,85,916 మంది అటెండ్ అయ్యారు. గ్రూప్1 పోస్టులను వర్టికల్ విధానంలో భర్తీ చేస్తామని తొలుత టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీని ప్రకారం 503 పోస్టుల్లో 225 పోస్టులు ఉమెన్స్​కు లభిస్తాయని వెల్లడించింది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో.. మళ్లీ హారిజాంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేస్తామని టీఎస్​పీఎస్సీ  వెల్లడించింది. ఐదు రోజుల క్రితం ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించిన  సమయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మల్టీజోన్, వివిధ కేటగిరీలు, కమ్యూనిటీ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50మందిని మెయిన్స్​కు ఎంపిక చేసినట్టు తెలిపింది. వారి హాల్​ టికెట్ నెంబర్లను వెబ్ సైట్​లో పెట్టింది. అయితే ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలియక అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. 

అభ్యర్థుల అభ్యంతరాలకూ సమాధానం కరువు

గ్రూప్1 పోస్టులకు వచ్చిన అప్లికేషన్లలో  ఎన్ని అమ్మాయిలవి ? ఎన్ని అబ్బాయిలవి ? అనే వివరాలనూ టీఎస్పీఎస్సీ ఇప్పటికీ వెల్లడించలేదు.  హారిజాంటల్​విధానం ప్రకారం.. ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు అమ్మాయిలకు ?  జనరల్ కేటగిరిలో ఎన్ని పోస్టులు ఉంటాయి ? అనే వివరాలను సైతం చెప్పలేదు. తాజాగా రిలీజ్ చేసిన ఫలితాల్లోనూ జనరల్ కేటగిరిలో ఎంతమంది, ఉమెన్స్ ఎంతమంది ఎంపికయ్యారనేది వెల్లడించలేదు. అయితే సివిల్స్ ​ప్రిలిమ్స్​ఫలితాల్లో మార్కులు వెల్లడించడం లేదు కాబట్టి.. అదే బాటలో తామూ విడుదల చేయడం లేదని టీఎస్​పీఎస్సీ చెబుతోంది. సివిల్స్ ఎగ్జామ్స్ ను టీఎస్పీఎస్సీ ఆదర్శంగా తీసుకోవడం మంచిదేనని.. అలాగైతే యూపీఎస్సీ మాదిరిగా ఇయర్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తున్నారా ? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.  మరోపక్క గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ‘కీ’ కు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాల వివరాలనూ కమిషన్ వెల్లడించలేదు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్టు చెప్తున్న కమిషన్ అధికారులు.. వివరాలను ఎందుకు గోప్యంగా పెడుతున్నారో చెప్పాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

మార్కులెన్ని వచ్చాయో ?

గ్రూప్ 1 అభ్యర్థులందరిలోనూ ఇప్పుడు మార్కులపైనే చర్చ నడుస్తోంది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రిలిమ్స్​ ఎగ్జామ్​లో ఐదు ప్రశ్నలను తొలగించారు. మరో 3 ప్రశ్నల ఆప్షన్లలో మార్పులు చేశారు. మొత్తం 150కిగానూ..145 ప్రశ్నలకే మార్కులను లెక్కిస్తామని టీఎస్పీఎస్సీ గతంలో ప్రకటించింది. ఈ లెక్కతో మార్కుల జాబితాపై చాలామందిలో అయోమయం నెలకొంది. ఒకే కేటగిరిలో సమానమైన మార్కులొస్తే.. ఆ అభ్యర్థుల్లో ఏజ్ కు ప్రయార్టీ ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు లక్షల మంది ఉండటంతో సమానమైన మార్కులు చాలామందికి వచ్చి ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ స్పందించి మార్కులను వెల్లడించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.