ట్రంప్ నిర్ణయంపై ‘నాటో’లో గందరగోళం

ట్రంప్ నిర్ణయంపై ‘నాటో’లో గందరగోళం

హెల్సింగ్​బోర్గ్ (స్వీడన్): యూరప్‌‌‌‌‌‌‌‌లో అమెరికా బలగాల మోహరింపుపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం నాటో కూటమి దేశాలను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. కొన్ని వారాల క్రితమే యూరప్ నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తామని చెప్పిన ట్రంప్.. గురువారం అందుకు భిన్నంగా తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోలెండ్‌‌‌‌‌‌‌‌కు అదనంగా 5 వేల మంది సైనికులను పంపుతామని పోస్ట్ చేశారు. ఇది నాటో దేశాలను విస్మయానికి గురిచేసింది. దీనిపై స్వీడన్‌‌‌‌‌‌‌‌లోని హెల్సింగ్‌‌‌‌‌‌‌‌బోర్గ్‌‌‌‌‌‌‌‌లో గురు, శుక్రవారాల్లో జరిగిన నాటో విదేశాంగ మంత్రుల సమావేశంలో తీవ్ర చర్చ నడిచింది. 

ప్రతినిధుల భిన్న స్పందన

ట్రంప్ తీసుకున్న యూ-టర్న్‎పై ఆయా దేశాల ప్రతినిధులు భిన్నంగా స్పందించారు. ట్రంప్​నిర్ణయం గందరగోళంగా ఉందని, ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవడం అంత సులువు కాదని స్వీడన్ విదేశాంగ మంత్రి మరియా మాల్మర్ స్టెనర్‌‌‌‌‌‌‌‌గార్డ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. దీనివల్ల తమ దేశంలో అమెరికా సైనిక బలం గతంలో ఉన్న స్థాయిలోనే కొనసాగుతుందని పోలెండ్ విదేశాంగ మంత్రి రాడెక్ సికోర్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే స్పందిస్తూ.. ట్రంప్​ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, యూరప్ దేశాలు తమ భద్రతను తామే చూసుకోవడం ముఖ్యమని తెలిపారు. ఈ ప్రకటన అంతరార్థం ఏమిటో తమకు కూడా అర్థం కావడం లేదని అమెరికా రక్షణ శాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం.. గ్లోబల్ కట్టుబాట్లకు అనుగుణంగా అమెరికా తన సైనిక మోహరింపును నిరంతరం సమీక్షించుకుంటుందని, ఇందులో ఎలాంటి కక్షసాధింపు చర్యలు లేవని స్పష్టం చేశారు.