డిగ్రీ, పీజీ,ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ పై గందరగోళం

డిగ్రీ, పీజీ,ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ పై  గందరగోళం
  • ఎగ్జామ్స్ రద్దుచేసే యోచనలో సర్కారు
  • ఫైనల్ సెమిస్టర్​కు పెట్టాలన్న యూజీసీ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, తదితర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పై మరోసారి గందరగోళం ఏర్పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో వివిధ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా, తాజాగా యూజీసీ మాత్రం సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది. దీంతో ఇప్పటివరకూ పరీక్షలు లేవని అనుకున్న స్టూడెంట్స్​లో గందరగోళం నెలకొంది. ఇంత జరుగుతున్నా, సర్కారు మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. వివిధ యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులకు సంబంధించి ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు కరోనా ఎఫెక్ట్​తో వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను జూన్ 20 తర్వాత నిర్వహించుకోవచ్చని, గతంలో యూజీసీ ఆదేశాలు ఇచ్చింది. కానీ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరగడంతో మరోసారి ఆ పరీక్షలను సర్కారు వాయిదా వేసింది. ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టకుండా గత సెమిస్టర్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని సర్కారు పెద్దలు భావించారు. ఇదే రిపోర్టును సీఎం కేసీఆర్​కు పంపించారు. ఇది జరిగి 2 వారాలు కావొస్తున్నా, సర్కారు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

త్వరలోనే ఎగ్జామ్స్ పెడతాం 

యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. రెగ్యులర్తో పాటు బ్యాక్ లాగ్, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా పెడతాం. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం.

-తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్

టెన్షన్లో 2.5 లక్షల స్టూడెంట్స్

యూజీసీ కొత్త గైడ్​లైన్స్​తో స్టూడెంట్స్​లో టెన్ష న్ మొదలైంది. డిగ్రీలో 1.10 లక్షల మంది, బీటెక్ 50 వేలు, పీజీ, ఫార్మసీ, ఎంటెక్.. ఇతర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ మరో 90 వేల మంది దాకా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ పరీక్షలు, ఎప్పుడు పెడ్తారనేది స్పష్టంగా చెప్పాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఎడ్ సెట్, ఐసెట్, పీఈసెట్, లాసెట్.. తదితర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పైనా ప్రభావం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ లోపు పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందా? అన్నఅనుమానాలూ ఉన్నాయి.