రేపు టీఏఎఫ్ఆర్సీ ప్రత్యేక భేటీ..ఇంజనీరింగ్ ఫీజులపై నిర్ణయం!

రేపు టీఏఎఫ్ఆర్సీ ప్రత్యేక భేటీ..ఇంజనీరింగ్ ఫీజులపై నిర్ణయం!
  • శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ రాష్ట్రాలకు సూచన
  • దీంతో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లతో హియరింగ్ ఆపేసిన టీఏఎఫ్ఆర్సీ
  • ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కోర్సులపైనా క్లారిటీ రాలే
  • రేపు టీఏఎఫ్ఆర్సీ ప్రత్యేక భేటీ

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజులపై అయోమయం నెలకొన్నది. రాష్ట్రంలో రానున్న మూడేండ్లకు ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్​ఆర్సీ) ప్రస్తుతం కాలేజీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ టీఏఎఫ్ఆర్సీకి ఏఐసీటీఈ లేఖ రాసింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న హియరింగ్‌‌‌‌‌‌‌‌ను ఆపేస్తున్నట్టు గురువారం టీఏఎఫ్ఆర్సీ ప్రకటించింది. ఫీజుల ఖరారు ప్రక్రియ నిలిచిపోయింది.

ఒకేసారి రెండింతలా?

రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంబీఏ, ఫార్మసీ తదితర 27 కోర్సులకు సంబంధించిన 1196 ప్రైవేటు కాలేజీల్లో 2022–23 నుంచి 2024–25 వరకు వివరాలు సేకరించింది. ఈనెల16 నుంచి మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లతో పర్సనల్ హియరింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఏఐసీటీఈ నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తెలంగాణలోనూ ఫీజులను ఖరారు చేయాలని సర్క్యూలర్ పంపించింది. శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల ప్రకారం రాష్ట్రంలో బీటెక్‌‌‌‌‌‌‌‌లో రూ.79,600 నుంచే మొదలు కావాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రూ.35 వేలు కనిష్ట ఫీజుగా ఉంది. ఒకేసారి రెండింతలకు పైగా ఫీజు పెంచడం సాధ్యమయ్యే పనికాదని అధికారులు చెప్తున్నారు. కమిటీ సిఫారసుల మేరకు బీటెక్ ఫీజు రూ.79600–1,89,800 దాకా, ఎంటెక్ ఫీజు 1,41,200–3,04,000, ఎంసీఏ ఫీజు రూ.88500–1,94,100, ఎంబీఏ ఫీజు రూ.85 వేల నుంచి రూ.1,95,200 దాకా ఇలా అన్ని రకాల కోర్సుల్లో ఫీజులు భారీగా ఉన్నాయి. అయితే కాలేజీల్లో ఏడో వేతన సంఘం సవరణ సిఫార్సుల మేరకు కమిటీ ఈ ఫీజులను ప్రతిపాదించినట్లు పేర్కొన్నది. అయితే తెలంగాణలో రెండు, మూడు కాలేజీలు మినహా ఈ సిఫార్సులు అమలు చేయట్లేదు. ఇలాంటి సమయంలో ఈ ఫీజులు ఎలా అమలు చేస్తారనే ప్రశ్న మొదలైంది.

చర్చించిన తర్వాత నిర్ణయం! 

ఏఐసీటీఈ లేఖపై చర్చించేందుకు టీఏఎఫ్ఆర్సీ శనివారం భేటీ కానుంది. కాలేజీల్లో ఫీజులను నిర్ణయించే అధికారం ఫీజు రెగ్యులేటరీ కమిటీలకే ఉందని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐసీటీఈ కూడా ఇదే విషయాన్ని హాండ్ బుక్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. అయినా ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ల ఒత్తిడితో శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను అమలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడంపై అధికారులు మండిపడుతున్నారు. న్యాయపరమైన అంశాలను చర్చించి ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు.