మంచిర్యాలలో మెడికల్​ కాలేజీ నిర్మాణంపై అయోమయం

మంచిర్యాలలో మెడికల్​ కాలేజీ నిర్మాణంపై అయోమయం
  • గోదావరి ఒడ్డున 22 ఎకరాలు కేటాయింపు.. పొంచి ఉన్న ముంపు ముప్పు
  • ఎంసీహెచ్, నర్సింగ్​ కాలేజీ సైతం అక్కడే..  
  • ఇప్పటికే నీటమునిగిన ఎంసీహెచ్​
  •  సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రతిపక్షాల డిమాండ్​ 

మంచిర్యాల, వెలుగు:మంచిర్యాలలో మెడికల్​ కాలేజీ నిర్మాణంపై అయోమయం నెలకొంది. గోదావరి ఒడ్డున ఉన్న భూదాన్​ భూముల్లో 22 ఎకరాలను మెడికల్, నర్సింగ్​ కాలేజీల కోసం కేటాయించారు. ఈ ప్రాంతమంతా గోదావరి వరదల్లో మునిగిపోతోంది. అదే భూముల్లో కట్టిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్​) మొన్నటి వరదలకు పూర్తిగా నీటమునిగింది. ప్రతి సంవత్సరం వరద ముప్పు పొంచి ఉండడంతో మెడికల్​కాలేజీని వేరే ప్రాంతంలో నిర్మించాలని, ఎంసీహెచ్​ను సైతం సురక్షిత ప్రాంతానికి తరలించాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు.  

కలెక్టరేట్​కు పనికిరాదన్న చోట...  

గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8 మెడికల్​ కాలేజీలు మంజూరు కాగా అందులో మంచిర్యాలకు ఒకటి దక్కింది. దీనిని జిల్లాలో ఎక్కడ నిర్మించాలనే తర్జనభర్జనల తర్వాత జిల్లా కేంద్రంలోనే ఖరారు చేశారు. మెడికల్​కాలేజీకి 20 ఎకరాలకు పైగా స్థలం అవసరం కావడంతో పలుచోట్ల ప్రభుత్వ భూములను పరిశీలించారు. చివరకు గోదావరి రోడ్డులో నది ఒడ్డున ఉన్న భూదాన్​ భూముల్లో నిర్మించాలని నిర్ణయించారు. 207, 208 సర్వే నంబర్లలో 22 ఎకరాలను కేటాయించారు. 2017లో ఇక్కడ ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​నిర్మించాలనుకున్నారు. ఆర్ అండ్​బీ అధికారులు సాయిల్​టెస్ట్​ చేసి కలెక్టరేట్​నిర్మాణానికి ఆ స్థలం అనుకూలం కాదని రిపోర్టు ఇచ్చారు. దీంతో కలెక్టరేట్​ను నస్పూర్​మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్నారు. నాడు కలెక్టరేట్​కు పనికి రాదన్న స్థలాన్నే నేడు మెడికల్​కాలేజీ కోసం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు వీటిని పట్టించుకోలేదు.  

కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో ముంపు 

మెడికల్​కాలేజీకి కేటాయించిన స్థలం గోదావరికి కూతవేటు దూరంలోనే ఉంది. అది పూర్తిగా లోతట్టు ప్రాంతం. సుందిళ్ల బ్యారేజీ బ్యాక్​వాటర్​తో గోదావరి ఎండాకాలం కూడా నిండు కుండను తలపిస్తోంది. వానాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా నీట మునుగుతోంది. ఇప్పటికే భూదాన్​ భూముల్లో నిర్మించిన ఎంసీహెచ్​పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు ఎంసీహెచ్​ మెట్ల దాకా నీళ్లు రాగా, మొన్నటి వరదలకు గ్రౌండ్​ ఫ్లోర్​ పూర్తిగా మునిగింది. ఎంసీహెచ్​దాటుకొని సుమారు 500 మీటర్ల వరకు వరద పోటెత్తింది. ముంపును ముందుగానే పసిగట్టిన అధికారులు రాత్రికి రాత్రే పేషెంట్లను గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించడంతో ప్రమాదం తప్పింది. విలువైన మెషిన్లు మునిగిపోవడంతో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది.  

ప్రజల ప్రాణాలతో చెలగాటమా.. 

గోదావరి ఒడ్డున ఏటా ముంపు ముప్పు పొంచి ఉంటుందని, ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రతిపక్షాల లీడర్లు హెచ్చరిస్తున్నారు. పట్టణంలో మెడికల్​ కాలేజీకి అనువైన స్థలాలు ఉన్నప్పటికీ ముంపు ప్రాంతంలో నిర్మించాలనుకోవడం తగదని విమర్శిస్తున్నారు. గవర్నమెంట్​హాస్పిటల్​కు ఎదురుగా ఉన్న ఐబీ గెస్ట్​హౌస్​ఆవరణలో ఇంటిగ్రేటెడ్​మార్కెట్​ను నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్​ను ఎంసీహెచ్​కు కేటాయించి మార్కెట్​ను మరో చోటికి షిఫ్ట్​ చేయాలని సూచిస్తున్నారు. ముంపు ప్రాంతంలో నిర్మించిన ఎంసీహెచ్​ను రీ ఓపెన్​చేస్తే అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, మాజీ ఎమ్మెల్సీ కె. ప్రేంసాగర్​రావు హెచ్చరించారు. టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరాం సైతం మెడికల్​ కాలేజీని ముంపు లేని ప్రాంతంలో నిర్మించాలని, అక్కడికే ఎంసీహెచ్​ను తరలించాలని డిమాండ్​ చేశారు. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది.