- గందరగోళంగా ముసాయిదా జాబితా
- పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు
నల్గొండ, యాదాద్రి / వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారులు విడుదల చేసిన మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితా గందరగోళంగా మారింది. మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఓటర్ల జాబితాపై భారీగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మున్సిపాలిటీ లోని ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓట్లు మరో బూత్‌లో చేరాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో డ్రాఫ్ట్ లిస్టుపై అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. ఓటర్ లిస్టులో తప్పులను సవరించాలని కోరుతూ విజ్ఞప్తులు వస్తున్నాయి. మున్సిపాలిటీల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుపై శుక్రవారం నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో పద్మావతి నగర్, ఆర్టీసీ కాలనీ, గొల్లగూడ, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. ఒక వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రాల ఓటర్లు మరొక వార్డుల్లోకి చేంజ్అయ్యాయి.
దీంతో 41 వార్డులో 3వేల మంది ఓటర్లకుగాను కేవలం 1500 మాత్రమే ఉన్నాయి. గొల్లగూడలో 42 వార్డుల్లో ఆర్టీసీ కాలనీ ఓటర్లు గల్లంతయ్యారు. దాదాపు 1200 ఓట్లు వేరొక వార్డులోకి మారిపోయాయి. ఈ వార్డుల్లో ఉండాల్సిన ఓటర్లు మరొక వార్డుల్లోకి మారిపోవడం వల్ల వాటిన్నింటి పైన అభ్యంతరాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర మున్సిపాలిటీల్లో ఇదేరకమైన తప్పిదాలు వచ్చాయని, ఇంటి నంబర్లు ఎంటర్ చేయడంలో పొరపాట్లు తలెత్తడం వల్ల ఓటర్లు గల్లంతయ్యాయరని చెప్తున్నారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీలో 42 వ వార్డుకు చెందిన 300 ఓట్లను 43 వ వార్డులో చేర్చారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 46వ వార్డులోని 200 మంది 41 వ వార్డులో చేర్చారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 2వ వార్డుకు సంబంధించి 101 ఓట్లను 27వ వార్డులోకి మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు గోవిందాపురంలోని 8,9 వార్డుల్లోకి 18,19,20,21 వార్డుల కు సంబంధించిన ఓట్లను మార్చారని అలాగే తిలక్‌నగర్, అంబేడ్కర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, 16, 17 వార్డుల్లో ఓట్లను కూడా ఇష్టానుసారంగా మార్చారన్న విమర్శలు ఉన్నాయి.
దొర్లిన తప్పులు
మున్సిపాలిటీల్లో ఈనెల 1న జారీ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తప్పుల తడకగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టు ఆధారంగా పబ్లిష్ చేసిన ఈ జాబితాలో పోలింగ్ స్టేషన్ల వారీగా అనేక తప్పులు దొర్లాయి. ఒక్కో వార్డులో మూడు వేల పై చిలుకు ఉండాల్సిన ఓటర్లు 2 వేలు, 14 వందల ఓటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో గల్లంతైన ఓటర్లు ఎక్కడున్నారో కనిపెట్టే పనిలో మాజీ కౌన్సిలర్లు బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం పరిధిలో వెయ్యి ఓట్లు ఉండాలనే నిబంధన చేర్చారు. కానీ ఇప్పుడు 800 ఓట్లకు తగ్గించారు. ఇలా చేయడం వల్ల పోలింగ్ కేంద్రాలు పెరిగి త్వరగా పోలింగ్ ముగుస్తుందనే ఉద్దేశంతో ఓటర్ల సంఖ్యను తగ్గించినట్టు తెలుస్తోంది.
నల్గొండ , మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హుజూర్నగర్ పెద్ద మున్సిపాలిటీల్లో ఈ తరహా తప్పులు ఎక్కుగా జరిగాయిలిస్ట్ లో చనిపోయిన వారి పేర్లు కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన ఓటర్‌లిస్ట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ‘టీ ఈ పోల్’ లో అప్లోడ్ చేసింది. ఓటర్ల పేర్లు ఎక్కువగా ఇతర వార్డుల్లో చేర్చారు. దీంతో తాము రెగ్యులర్‌గా ఓటేసే వార్డుల్లో పేర్లు కన్పించక పోవడంతో ఓటర్లు కంగారుపడ్డారు. చివరకు వేరే వార్డుల్లో తమ పేర్లు చూసుకొని ఆశ్చర్యపోయారు. దీంతో తమ పేర్లను పాత వార్డులోనే కొనసాగించాలని కోరుతూ ఫిర్యాదులు చేస్తున్నారు. పైగా ఈ లిస్ట్‌లో చనిపోయిన వారి పేర్లు కూడా చోటు చేసుకున్నాయి. చనిపోయిన 30 మంది పేర్లు చౌటుప్పల్‌లోని ఒక వార్డు లిస్ట్‌లో ఉన్నాయి.
దీంతో పాటు కొందరి ఓటర్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు లిస్ట్‌లో కన్పించాయి. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే వార్డుల్లో ఉండేలా చూస్తామని ప్రకటనలు చేసినా ఆచరణలో మాత్రం కన్పించలేదు. వేర్వేరు వార్డుల్లో ఓటర్ల పేర్లు చోటు చేసుకున్నాయి. పేర్ల టైపింగ్‌లో స్పెల్లింగ్మిస్టేట్స్ఎక్కువగా ఉన్నాయి. ఓటర్ల పేర్లు ఇతర వార్డుల్లో చేర్చడం వల్ల రిజర్వేషన్లు మారే అవకాశముందని ఆశావహులు అంటున్నారు. ఓటరు లిస్ట్‌పై అభ్యంతరాలను తెలిపేందుకు మున్సిపాలిటీల్లో కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో తమ పేర్లు గతంలో ఉన్న వార్డుకే మార్చాలని పలువురు ఫిర్యాదులు చేశారు. భువనగిరిలో బీజేపీ లీడర్లు వార్డులు మార్చడంపై ఫిర్యాదు చేశారు. మొత్తంగా 50కి పైగా ఫిర్యాదులు వచ్చాయి.
ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా
ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణ చేపడుతున్నారు. డిసెంబర్ 30న పోలింగ్ స్టేషన్ల డేటా సవరణ, 31న పోలింగ్ స్టేషన్ వారిగా పునర్వ్యస్థీకరణ, జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 5న రాజకీయ పార్టీ ప్రతినిధులతో మీటింగ్, 6న జిల్లాస్థాయిలో ఎన్నికల అధికారులతో మీటింగ్, 10న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ మినహా ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీ లలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు.
