ప్రైవేట్ కు సపోర్ట్ చేసేలా స్కూల్​ ఎడ్యుకేషన్​ ఉత్తర్వులు

ప్రైవేట్ కు సపోర్ట్ చేసేలా స్కూల్​ ఎడ్యుకేషన్​ ఉత్తర్వులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూళ్లలో ఆన్​లైన్​ క్లాసులపై గందరగోళం నెలకొంది. ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించొద్దని ప్రైవేటు యాజమాన్యాలకు సూచించిన డీఈవోలకే స్కూల్​ ఎడ్యుకేషన్​ కమిషనర్​ వార్నింగ్​ ఇచ్చారు. కరోనా ప్రభావంతో 2020–21 విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, దాంతో సంబంధం లేకుండా కొన్ని స్కూళ్లు ఆన్​లైన్​ క్లాసులు స్టార్ట్​ చేశాయి. ఫీజులూ దండుకుంటున్నాయి. దీనిపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు డీఈవోలకు ఫిర్యాదు చేశారు. దీంతో క్లాసులు నిర్వహించొద్దని కొందరు డీఈవోలు ప్రైవేటు స్కూళ్లకు చెప్పారు. దీనిపై స్పందించిన స్కూల్​ ఎడ్యుకేషన్​ కమిషనర్​ చిత్రా రామచంద్రన్​ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవీ ప్రైవేటు యాజమాన్యాలకు సపోర్ట్​ చేసేలాగానే ఉండడం గమనార్హం.

విద్యాసంవత్సరం ప్రారంభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆన్​లైన్​ క్లాసులపైనా ఎలాంటి గైడ్​లైన్స్​ ఇవ్వలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా అంటూనే డీఈవోలకూ వార్నింగ్​ ఇచ్చారు. ఈ విషయంపై మళ్లీ ప్రకటనలు చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ, సర్కారు ఆదేశాలు వచ్చే వరకు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించొద్దని గానీ, కాదని ఆన్​లైన్​ క్లాసులు పెడితే చర్యలు తీసుకుంటామనిగానీ ప్రైవేటు, కార్పొరేట్​ స్కూళ్లకు ఎక్కడా వార్నింగ్​ ఇవ్వలేదు. అది పూర్తిగా ప్రైవేట్​ స్కూలు యాజమాన్యాలకు వత్తాసు పలకడమేనని స్టూడెంట్స్​ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేట్​ స్కూళ్లు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించుకోవాలని ట్రస్మా ప్రెసిడెంట్​ యాదగిరి శేఖర్​రావు ప్రకటన విడుదల చేశారు.