తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్​ బ్యాలెట్​పై గందరగోళం

తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్​ బ్యాలెట్​పై గందరగోళం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం కొనసాగుతున్నది. ఈ సమస్యపై పలు చోట్ల ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 119 సెగ్మెంట్లలో దాదాపు 3 లక్షల మంది ఎలక్షన్ డ్యూటీలో  ఉండగా.. అందులో 1 లక్ష 60 వేల మందికి పోస్టల్ బ్యాలెట్‌‌ ద్వారా ఓట్లు వేసేందుకు ఈసీ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 56 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను  వినియోగించుకున్నారు. 29వ తేదీ లోపు మరో లక్ష మంది ఎలక్షన్ సిబ్బంది తమ ఓట్లను వినియోగించుకోనున్నారు. 

అయితే, ఆర్వోలకు ట్రైనింగ్​లో చెప్పింది ఒకటైతే.. గ్రౌండ్​లో ఇంకో తీరులో పోస్టల్​బ్యాలెట్​ఓటు ప్రక్రియ జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. పోస్టల్​బ్యాలెట్​ ఓటు హక్కు వినియోగించుకోకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  అందులో భాగంగానే శనివారం చాలాచోట్ల ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్​ బ్యాలెట్ ఓటింగ్​పై ఆందోళనకు దిగారు.  

ఈసారి అంగన్​వాడీలకు కూడా ఈసీ ఎన్నికల విధులను అప్పగించింది. వారికి సొంత పోలింగ్​స్టేషన్ల పరిధిలో కాకుండా ఇతర పోలింగ్​కేంద్రాల్లో విధులు కేటాయించారు. దీంతో ఈ ఎన్నికల్లో  దాదాపు 30 వేలకు పైగా  అంగన్​వాడీలు, ఇతర సిబ్బంది తమ పోస్టల్​ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నట్లు తెలిసింది.