కాంగ్రెస్ పార్టీ తుప్పు పట్టిన ఇనుము.. వర్షంలో తడిస్తే ఖతమైతది: మోదీ

కాంగ్రెస్ పార్టీ తుప్పు పట్టిన ఇనుము.. వర్షంలో తడిస్తే ఖతమైతది: మోదీ
  • శిథిల కాంగ్రెస్ దివాలా తీసింది
  • ఆ పార్టీని ఔట్‌‌సోర్సింగ్‌‌ కింద అర్బన్ నక్సల్స్‌‌కు ఇచ్చారు
  • ‘కార్యకర్త మహాకుంభ్’లో ప్రధాని వ్యాఖ్యలు

భోపాల్/జైపూర్:  కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు వేరే దారి లేక, అయిష్టంగానే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు.‘‘కాంగ్రెస్ పార్టీ.. తుప్పు పట్టిన ఇనుము లాంటిది. వర్షంలో తడిస్తే ఖతమైపోతుంది. ఆ పార్టీని నేతలు నడపడం లేదు. అర్బన్ నక్సల్స్‌‌కు ఔట్‌‌సోర్సింగ్‌‌కు ఇచ్చారు” అని ఆరోపించారు. సోమవారం మధ్యప్రదేశ్‌‌లోని భోపాల్‌‌లో బీజేపీ కార్యకర్తలతో ‘కార్యకర్త మహాకుంభ్’ను నిర్వహించారు. జన సంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్‌‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. మధ్యప్రదేశ్‌‌లో కాంగ్రెస్‌‌కు అధికారమిస్తే బీమారు (వెనుకబడిన) కేటగిరీలోకి తీసుకెళ్తుందని ప్రజలను హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్, ఘమండియా కూటమిలోని దాని మిత్రపక్షాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అయిష్టంగానే మద్దతిచ్చాయి. ఎందుకంటే ఆ పార్టీలు నారీ శక్తి పవర్‌‌‌‌ను అర్థం చేసుకున్నాయి” అని అన్నారు. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమేనని, అందుకే బిల్లు పాస్ అయిందని అన్నారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నప్పుడు మహిళా బిల్లును పాస్ చేసేందుకు సహకరించలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌‌కు అధికారమిస్తే.. ఈ బిల్లును వెనక్కి తెస్తుందని మండిపడ్డారు.  

కాంట్రాక్టు కింద లీజుకు ఇచ్చారు

‘‘తొలుత కాంగ్రెస్ శిథిలమైంది. తర్వాత దివాలా తీసింది. ఇప్పుడు ఆ పార్టీని ఓ కాంట్రాక్టు కింద లీజుకు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ విధానాలను, నినాదాలను రూపొందిస్తున్నారు. అయితే ఆ పార్టీ నాయకులతో నడవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌‌ను ఔట్‌‌సోర్సింగ్ కింద అప్పజెప్పారు. ఆ కాంట్రాక్టును అర్బన్ నక్సల్స్ దక్కించుకున్నారు” అని ప్రధాని మోదీ విమర్శించారు. ‘‘మహిళా బిల్లు పాస్ కాకుండా 30 ఏండ్లు అడ్డుకున్నారు. దశాబ్దాలపాటు మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపినా.. బిల్లును ఎందుకు పాస్ చేయలేదు?” అని ప్రశ్నించారు. మహిళలను విభజించేందుకు జరిగే ప్రయత్నాల విషయంలో అలర్ట్‌‌గా ఉండాలని కోరారు.

వ్యవసాయ భూములు వారికి షూటింగ్ స్పాట్లు

‘‘సిల్వర్‌‌‌‌ స్పూన్‌‌తో పుట్టిన కాంగ్రెస్ నేతలకు.. పేద ప్రజల జీవితం ఒక అడ్వెంచర్ టూరిజం, పిక్నిక్ లాంటిది. పేదవాడి వ్యవసాయ భూమి వీడియో షూటింగ్‌‌కు, ఫోటో సెషన్‌‌కు ఒక వేదిక లాంటిది” అని రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు.

రెడ్‌‌ డైరీలో నల్ల పనులు దాగున్నయ్

తన బాల్యంలో దీన్‌‌దయాళ్ ఉపాధ్యాయ గడిపిన జైపూర్ జిల్లాలోని ధంక్య గ్రామంలో మోదీ పర్యటించారు. దీన్‌‌దయాళ్‌‌కు నివాళులర్పించారు. వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్‌‌లో కమలం వికసిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. వివాదాస్పద ‘రెడ్ డైరీ’ గురించి ప్రస్తావిస్తూ.. అందులో నల్ల పనులకు సంబంధించిన రహస్యాలు దాగున్నాయని ఆరోపించారు. ఇక్కడి అధికార కాంగ్రెస్ పార్టీ క్రిమినల్స్‌‌కు స్వేచ్ఛ ఇస్తోందని మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని కాపాడలేని ప్రభుత్వాన్ని తొలగించాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చారు.