వారసత్వ పన్నుపై నా కామెంట్లను బీజేపీ వక్రీకరిస్తోంది: పిట్రోడా

వారసత్వ పన్నుపై నా కామెంట్లను బీజేపీ వక్రీకరిస్తోంది: పిట్రోడా

న్యూఢిల్లీ : వారసత్వ పన్ను విధానంపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని ఇండియన్​ ఓవర్సీస్​ కాంగ్రెస్​ చైర్మన్​ శ్యాం పిట్రోడా అన్నారు. కాంగ్రెస్​  మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వారసత్వ పన్ను విధానంపై ఓ ఇంటర్వ్యూలో శ్యాం పిట్రోడా చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. అమెరికాలో వ్యక్తి మరణిస్తే అతడి ఆస్తిలో 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, తిరిగి ప్రజలకు పంపిణీ చేస్తుందని ఆయన ఇంతకుముందు చెప్పారు.

ఆ వ్యక్తి వారసులకు 45 శాతం సంపద మాత్రమే చెందుతుందని వివరించారు.  ‘అదొక ఆసక్తికరమైన అంశం. మీరు సంపదను సృష్టించి, వదిలేసి వెళ్లిపోతున్నారు. ప్రజలకోసం దాన్ని వదిలేయాలి. మొత్తం వదిలేయడం లేదు కదా.. సగమే విడిచిపెడుతున్నారు. ఇది నాకు న్యాయంగా అనిపిస్తోంది’ అని పిట్రోడా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఈ వారసత్వ విధానం ప్రజలకు ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించింది. అయితే,  అమెరికాలో ఉన్న విధానాన్ని మాత్రమే చెప్పానని, ఇది తమ పార్టీ పాలసీ కాదని శ్యాం స్పష్టం చేశారు. కాంగ్రెస్​ మేనిఫెస్టోలో ఆర్థిక, కుల గణన చేపడతామని పేర్కొన్నదని, కానీ ఎక్కడా సంపదను పంపిణీ చేస్తామని చెప్పలేదన్నారు.