5 రాష్ట్రాల ఎన్నికల కోసమే పెట్రోల్‎పై ట్యాక్స్ తగ్గింపు.. ప్రజలకు ఒరిగిందేమి లేదు: కాంగ్రెస్

5 రాష్ట్రాల ఎన్నికల కోసమే పెట్రోల్‎పై ట్యాక్స్ తగ్గింపు.. ప్రజలకు ఒరిగిందేమి లేదు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: పెట్రోల్, డిజిల్‎పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై కాంగ్రెస్ స్పందించింది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే పెట్రోల్, డిజిల్‎పై కేంద్రంలోని మోడీ సర్కార్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని ఆరోపించింది. దీని వల్ల ప్రజలకు ఒరిగిందేమి లేదని విమర్శించింది. శుక్రవారం (మార్చి 27) కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. 

ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసమే బీజేపీ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలు తగ్గించకపోవడమే ఇందుకు నిదర్శమని అన్నారు. 

పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఎక్సైజ్ సుంకం తగ్గింపులు చమురు మార్కెటింగ్ కంపెనీలకే తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత కూడా ప్రజలు అదే మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. గత పదకొండున్నర సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 12 సార్లు పెంచిందని, ఇప్పుడు దానిని తగ్గించినా కూడా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు.

 దేశ ప్రజలపై భారం పడకుండా ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంటున్నారు. అసలు ప్రభుత్వం అంటేనే ప్రజలు. ఆ డబ్బు కూడా భారత ప్రజలకు చెందినదేనని చరకలంటించారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల వినియోగదారులకు ఇంధన ధరలు నిజంగా తగ్గుతాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‎పై అదనపు ఎక్సెజ్ సుంకాన్ని తగ్గించి ఉపశమనం కల్పించింది. గురువారం నాటి ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, పెట్రోల్‎పై ఇంతకుముందు లీటరుకు రూ.13గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.3కి తగ్గించారు. 

దీనివల్ల లీటరుకు రూ.10 మేర సుంకం తగ్గింది. డీజిల్‎పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 నుంచి రూ.0కి తగ్గించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ భారం ఆయిల్ కంపెనీలపై పడుతోంది. 

దీంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డిజిల్ ధరలు పెంచి నష్టాన్ని భర్తీ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డిజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపకుండా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించి చమురు కంపెనీలకు ఉపశమనం కల్పించింది.