కాంగ్రెస్​లో కొత్త ముఖాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న లీడర్లు

కాంగ్రెస్​లో కొత్త ముఖాలు..  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న లీడర్లు
  • మూడు చోట్లా పోటాపోటీ కార్యక్రమాల్లో నేతలు  
  • మరింత ముదురుతున్న గ్రూపు రాజకీయాలు  
  • మంచిర్యాలలో బీసీ నినాదంతో మరికొందరు 

మంచిర్యాల, వెలుగు:  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీకి దీటుగా ప్రధాన ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు దర్శనమిస్తున్నాయి. హైకమాండ్ చాన్స్​ఇస్తే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్​పార్టీలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వారు తనకే టికెట్​వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. తమ అనుచర గణాన్ని వెంటేసుకొని ఊర్లు తిరుగుతూ ప్రజల అండదండలు పొందేందుకు కష్టపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు, నలుగురు లీడర్లు టికెట్​రేసులో ఉండడంతో ఎవరి వెంట వెళ్లాలని క్యాడర్​కన్​ఫ్యూజ్​అవుతున్నారు. 

మంచిర్యాలలో జనరల్​ కావడంతో..

మంచిర్యాల జనరల్ సీటు కావడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్ సాగర్ రావు ఈసారి ఎలాగైనా గెలవాలన్న తపనతో ఉన్నారు. సీనియర్ లీడర్​కేవీ.ప్రతాప్ కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తూ ప్రేమ్​సాగర్​రావుకు పోటీగా క్యాడర్​ను కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటీవలే ఆ పార్టీలో చేరిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ సైతం తాను మంచిర్యాల టికెట్ రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రేమ్​సాగర్ సీఎల్పీ లీడర్​భట్టి విక్రమార్క గ్రూపు కాగా, మిగతా ఇద్దరు టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి వర్గంగా జిల్లాలో కొనసాగుతున్నారు.

చెన్నూరులో ఐదుగురు

ఎస్సీ రిజర్వుడ్​నియోజకవర్గమైన చెన్నూర్ లో కాంగ్రెస్​లీడర్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ పై సొంత పార్టీలోనే అసంతృప్తి రగులుతోంది. పరిస్థితులు సానుకులంగా ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న అంచనాలతో పలువురు లీడర్లు తెరపైకి వస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రామిళ్ల రాధిక మహిళా కోటాలో టికెట్​ఆశిస్తున్నారు. మందమర్రిలో బెల్ట్ షాపులను ఎత్తేయాలని కొద్దిరోజుల కిందట ఆమె ఆందోళన చేపట్టగా పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె గ్రామాల్లో పర్యటిస్తూ బాల్క సుమన్ అవినీతి పరుడంటూ ప్రజల్లో ఆయనను ఎండగడుతున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో పాటు కాంగ్రెస్​లో చేరిన సింగరేణి డాక్టర్​రాజా రమేశ్​చెన్నూర్ టికెట్ కోసం సీరియస్​గా ట్రై చేస్తున్నారు. నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. అలాగే పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్​ఇన్​చార్జ్​గా ఉన్న సీనియర్​లీడర్​గొమాస శ్రీనివాస్ పేరు సైతం తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల ప్రేమ్​సాగర్​రావు వ్యతిరేకులను కూడగట్టి మంచిర్యాలలో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రేమ్ సాగర్ రావు అనుచరుడైన నూకల రమేశ్ సైతం ఆశావహుల రేసులో ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.  

బెల్లంపెల్లిలో తీవ్ర పోటీ..

బెల్లంపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి గడ్డం వినోద్ సిట్టింగ్​ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ్ సాగర్ రావు వర్గం వినోద్ అనుచరులపై దాడి చేయడం, ప్రేమ్​సాగర్​రావుపై వినోద్​చెక్​ బౌన్స్​కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. వినోద్​పై నాన్​లోకల్​ముద్రవేస్తూ లోకల్​సెంటిమెంట్​ను రెచ్చగొట్టడంతో ప్రేమ్​సాగర్​రావు వర్గానికి చెందిన ఎనిమిది మందికి టీపీపీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్​నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఇక్కడ చిలుముల శంకర్​తోపాటు మరికొందరు లీడర్లు ఆశావహుల లిస్టులో ఉండడంతో వారిలో వారికే పోటీ ఎక్కువైంది.