
తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానలు సంబరాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ 5వ తేదీ మంగళవారం పలు జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నిజామాబాదు జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు.. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుని అనందం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ఎదుట యూత్ కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రకటనతో సూర్యాపేట జిల్లా చివేముల మండలం వట్టికాంపాడ్ గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు.. బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో, హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఇక నుంచి మా ఊరి పేరు కొండారెడ్డి పల్లి కాదని.. సీఎం ఊరు అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు, అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు రాత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.