కాంగ్రెస్కు క్యాడరే బలం

కాంగ్రెస్కు క్యాడరే బలం

రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి నేతలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వలసపోతున్నప్పటికీ క్యాడర్​ మాత్రం పార్టీతోనే ఉంటామంటోంది. ఇటీవల జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనం. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని వెల్లడించారు. అంతే.. పార్టీ క్యాడర్  ఎదురు తిరిగింది. పార్టీ వీడొద్దంటూ తమ నిరసనను ఆయన ముందే వెలిబుచ్చింది. హస్తం గుర్తుపై గెలిచి ఇప్పుడు పార్టీ ఎలా మారుతారంటూ ప్రశ్నించింది. ‘‘మీరు పార్టీ మారినా మేము మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతాం” అని కాంగ్రెస్​ కార్యకర్తలు తేల్చిచెప్పారు. ‘జై కాంగ్రెస్’  నినాదాలు చేస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కొన్ని పార్టీలు తమ నేతలను, ఎమ్మెల్యేలను వాళ్లవైపు తిప్పుకుంటున్నాయని, అయితే తాము మాత్రం ఆ వలలో పడే ప్రసక్తి లేదని కాంగ్రెస్​ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు అంటున్నారు. గతంలో కాంగ్రెస్​ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి టీఆర్​ఎస్​లోకి వెళ్లగా.. వారి నియోజకవర్గాల్లోని క్యాడర్​ ఎదురు తిరిగింది. పరిషత్​ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయా ఎమ్మెల్యేలను బహిరంగంగానే నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి.  ఎమ్మెల్యేలు పార్టీ వీడినా కాంగ్రెస్ ఆయా నియోజకవర్గాల్లో ఏమాత్రం వీక్ కాలేదని లోక్​సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పైగా పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వారి అనుచరులే పోలీస్టేషన్లలో కేసులు పెట్టారని గుర్తుచేశారు. నేతలు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పినా.. క్యాడర్ మాత్రం కాంగ్రెస్ వెంట ఉందనేదానికి ఈ ఘటనలే ఉదాహరణ అన్నారు.