కాంగ్రెస్, బీఆర్ఎస్ కవల పిల్లలు : రఘునందన్ రావు

కాంగ్రెస్, బీఆర్ఎస్ కవల పిల్లలు : రఘునందన్ రావు
  •     నాకు గడి ఉంటే..రాసిచ్చేందుకు రెడీగా ఉన్న
  •     ఇచ్చిన హామీలు మరిచిపోవడం కాంగ్రెస్​కు అలవాటే..
  •     అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఎంపీగా పోటీ చేయొద్దా?
  •     మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం
  •     ‘మీట్ ది ప్రెస్’లో బీజేపీ ఎంపీ అభ్యర్థి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ కవల పిల్లలు అని, కేసీఆర్ దారిలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. రేవంత్​తో తమకు ఎలాంటి దోస్తానా లేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొని మాట్లాడారు. 

‘‘మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని చాలా సర్వేలు చెప్తున్నయ్. యూపీఏ హయాంలో రోజుకు 7 కిలో మీటర్ల మేర నేషనల్ హైవేలు వేస్తే.. బీజేపీ నేతృత్వంలోని సర్కార్​లో 35 నుంచి 37 కిలో మీటర్ల మేర నిర్మాణం జరిగింది. ఇచ్చిన హామీలు మర్చిపోవడం కాంగ్రెస్​కు అలవాటే. నేను మూడేండ్లలో దుబ్బాక కోసం ఏం చేశానో అన్ని వివరిస్తూ బుక్ తీసుకొచ్చిన. నాకు గడీ ఉందని సీఎం రేవంత్ అంటున్నరు. నాకు గడీ ఉన్నది నిజమే అయితే.. దాన్ని రాసిచ్చేందుకు రెడీగా ఉన్న. రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా నేనే పెట్టుకుంటా’’అని అన్నారు. 

అలా అనుకుంటే పొరపాటే..

బీసీ బిడ్డకు ఓటేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారని, అయితే.. ఆ బీసీ బిడ్డ ఇల్లు, తన ఇల్లు ఒకసారి చూడాలని రఘునందన్ రావు కోరారు. ఆ తర్వాత గడి ఎవరిదో తేల్చాలన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఎంపీగా పోటీ చేయొద్దా? అని రేవంత్, హరీశ్ రావును ప్రశ్నించారు. ‘‘నా పోటీ గురించి రేవంత్, హరీశ్ రావు చేసిన కామెంట్లను ఖండిస్తున్న. కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్.. బస్సు వేసుకుని ఎలా తిరుగుతున్నారు? ఎన్నికల టైమ్ అని.. ఏది మాట్లాడితే అది చెల్లుతుందని అనుకుంటే పొరపాటే. 

తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుస్తది. 2015లో ఓటుకు నోటు కేసు రిజిస్టర్ అయింది. 2024 వచ్చినా ఆ కేసు ఏమైందో తెల్వదు. నేను అసెంబ్లీకి వస్తే తమ కుర్చీలు ఉండవనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్ కలిసి నన్ను ఓడించిన్రు’’అని అన్నారు. మెదక్​తో వెంకట్రామిరెడ్డికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. నీలం మధు, వెంకట్రామిరెడ్డికి భూములు దోచుకోవడం, కబ్జాలు చేయడం మాత్రమే తెలుసని ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.