లోక్​సభ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్

లోక్​సభ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ, వెలుగు: లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇప్పటికే క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలు, రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను నియమించిన హైకమాండ్​.. లోక్​సభ స్థానాలకు కో-ఆర్డినేటర్లను నియమించింది. దేశంలోని 35 రాష్ట్రాలు/యూటీల్లోని లోక్​సభ స్థానాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఈ కో-ఆర్డినేటర్లను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నియమించినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణలోని 17 లోక్​సభ స్థానాల బాధ్యతలను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పార్టీ సీనియర్లకు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు సికింద్రాబాద్, హైదరాబాద్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మహబూబాబాద్, ఖమ్మం రెండేసి చోట్ల బాధ్యతలు ఇచ్చారు.

మంత్రులు సీతక్కకు ఆదిలాబాద్, శ్రీధర్ బాబుకు పెద్దపల్లి, పొన్నం ప్రభాకర్​కు కరీంనగర్, దామోదర రాజనర్సింహకు మెదక్, తుమ్మలకు మల్కాజిగిరి, జూపల్లికి నాగర్ కర్నూల్, ఉత్తమ్​కు నల్గొండ, కోమటిరెడ్డికి భువనగరి, కొండ సురేఖకు వరంగర్ కో-ఆర్డినేటర్​ బాధ్యతలను అప్పగించారు. అలాగే పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి నిజామాబాద్, సుదర్శన్ రెడ్డికి జహీరాబాద్ బాధ్యతలు ఇచ్చారు.