డీసీసీ అధ్యక్షుల నియామకం..సూర్యాపేటకు గుడిపాటి నర్సయ్య, నల్గొండ పున్నా కైలాష్ నేత

డీసీసీ అధ్యక్షుల నియామకం..సూర్యాపేటకు గుడిపాటి నర్సయ్య, నల్గొండ పున్నా కైలాష్ నేత
  • యాదాద్రి జిల్లాకు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య 

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. ముందు నుంచి అనుకున్నట్లు గానే  బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన లీడర్లనే డీసీసీ ప్రెసిడెంట్లుగా ప్రకటించింది. నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మునుగోడుకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత పున్నా కైలాశ్​ నేత (పద్మశాలి) సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సీనియర్​ నేత గుడిపాటి నర్సయ్య పేర్లను అధిష్టానం ప్రకటించింది. 

యాదాద్రి జిల్లాకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను నియమించింది.  ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతుండగా.. పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీలకు ప్రయార్టీ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న లీడర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. 

ఇప్పటి వరకు ఎస్టీ, బీసీ, రెడ్డి వర్గాలకు చెందిన లీడర్లు డీసీసీ పదవుల్లో ఉన్నారు. దీనికి భిన్నంగా ఈసారి సామాజిక కూర్పుకే ప్రాధాన్యత ఇచ్చారు. నియోజకవర్గాల్లో పార్టీ నేతల అభిప్రాయా లు, ఎమ్మెల్యేలు, మంత్రులు సూచన మేరకు డీసీసీ అధ్యక్షులను నియమించారు. 

బీసీలకు అరుదైన ఛాన్స్​..

 నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి జానారెడ్డి వర్గీయుడు కొండేటి మల్లయ్య, మంత్రి కోమటిరెడ్డి వర్గీయుడు గుమ్మల మోహన్​ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నించారు. వీళ్లద్దరు ఇప్పటికే పీసీసీ కమిటీలో ఉన్నందున మళ్లీ జిల్లా పదవుల్లో ఛాన్స్​ ఇవ్వలేదు. పైగా నల్గొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో మునుగోడు, నల్లగొండ, నాగార్జునసాగ ర్, మిర్యాలగూడలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉండటం, ఎస్టీల్లో ఎమ్మెల్యేగా బాలూనాయక్​, ఎమ్మెల్సీగా శంకర్​ నాయక్​ ఉన్నందున బీసీలకు ఇవ్వాలని అధిష్టానం తీర్మానించింది. 

ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో పద్మశాలి వర్గం నుంచి ప్రాధాన్యత ఎవరికి దక్కలేదు. ఈ జిల్లాలో ఆ వర్గం ఓటర్లు బలంగా ఉండటం, పున్నా కైలాష్​కు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం రేవంత్​ రెడ్డి అండ దండలు పుష్కలంగా ఉన్నాయి.  

దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డి వర్గీయుడు తుంగతుర్తికి చెందిన సీనియర్​ నేత గుడిపాటి నర్సయ్యను డీసీసీ పదవి వరించింది. 2023 ఎన్నికల వరకు తుంగతుర్తి ఇన్​చార్జిగా పనిచేశారు. మందుల సామేల్​కు టి కెట్​ ఇవ్వడంతో నర్సయ్య ఛాన్స్​ దక్కలే దు.