కీలక నేతల ఇలాకాల్లోనూ కాంగ్రెస్ అంతంతే

కీలక నేతల ఇలాకాల్లోనూ  కాంగ్రెస్ అంతంతే

హైదరాబాద్‌‌, వెలుగు:

మున్సిపల్‌‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌‌కు షాక్‌‌  ఇచ్చాయి. నేతల స్వయంకృతాపరాధం కొంప ముంచిందనే అభిప్రాయాలున్నాయి. పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించలేదని, కొందరు పూర్తిగా తమ నియోజకవర్గాలకే పరిమితం కావడంతో గెలవాల్సిన మున్సిపాలిటీలను చేజార్చుకోవాల్సి వచ్చిందని కిందిస్థాయి నేతలు అంటున్నారు. సరైన వ్యూహం లేనందునే పార్టీ మరోసారి ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. అయితే ముఖ్య నేతలు కొందరు తమ నియోజకవర్గ పరిధిలోనే ప్రచారం చేసినా, అక్కడ కూడా  సరైన ఫలితాలు సాధించలేకపోయారు.

ముఖ్య నేతల ప్రాంతాల్లో ఇలా..

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి తన సమయాన్నంతా మున్సిపోల్స్‌‌కే వెచ్చించినా హుజూర్‌‌నగర్‌‌లో 6 వార్డులు మాత్రమే సాధించగలిగారు. ఇక్కడ టీఆర్‌‌ఎస్‌‌ 21 స్థానాల్లో గెలిచింది. నేరేడుచర్లలో 15 స్థానాలకు గాను కాంగ్రెస్‌‌, టీఆర్‌‌ఎస్‌‌  తలా 7 స్థానాలు దక్కించుకున్నాయి. నల్గొండలో కూడా ఇదే రకమైన ఫలితాలు వచ్చాయి. కోదాడ, మిర్యాలగూడ టీఆర్‌‌ఎస్‌‌ ఖాతాలోకి చేరాయి. హాలియాలో మాత్రం కాంగ్రెస్‌‌కు టీఆర్‌‌ఎస్‌‌ కన్నా ఒక స్థానం ఎక్కువ వచ్చినా మ్యాజిక్‌‌ ఫిగర్‌‌ దక్కలేదు. పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్‌‌–మల్కాజిగిరి జిల్లాలోని నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లో టీఆర్‌‌ఎస్‌‌ విజయం సాధించింది. ఎంపీ ఎన్నికల సమయంలో రేవంత్‌‌ గెలుపునకు ఎంతో ఉపయోగపడ్డ ఫిర్జాదిగూడ, బోడుప్పల్‌‌ మున్సిపాలిటీల్లో కూడా గులాబీ జెండా ఎగిరింది. బోడుప్పల్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌ మేయర్‌‌ అభ్యర్థిని మాత్రం కాంగ్రెస్‌‌ అభ్యర్థి ఓడించగలిగారు. కానీ మున్సిపాలిటీ మాత్రం కైవసం చేసుకోలేకపోయారు. కాంగ్రెస్‌‌ ఎంపీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి కొంత బెటర్‌‌ అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రాతినిధ్యం వహించే మున్సిపాలిటీల్లో ఆదిభట్ల, పెద్ద అంబర్‌‌పేట, తుర్కయంజాల్‌‌, చండూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌‌ విజయం సాధించింది. యాదగిరిగుట్టలో టీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ తలా నాలుగు, ఇండిపెండెంట్లు మరో నాలుగు స్థానాలు సందించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజక వర్గ పరిధిలోని మధిరలో టీఆర్‌‌ఎస్‌‌ విజయ కేతనం ఎగుర వేసింది. ఎమ్మెల్సీ జీవన్‌‌ రెడ్డి ఇలాకా జగిత్యాలలో కాంగ్రెస్‌‌ తక్కువ స్థానాల్లో (48వార్డుల్లో ఏడు వార్డులే) గెలుపొందింది. మండలి మాజీ ఎల్పీ నేత షబ్బీర్‌‌ అలీ నియోజక వర్గంలోని కామారెడ్డిలో కాంగ్రెస్‌‌ 49 వార్డుల్లో 12 స్థానాల్లోనే గెలిచింది. పీసీసీ రేసులో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి శ్రీధర్‌‌ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో (మంథని, సంగారెడ్డి) కాంగ్రెస్‌‌ ఓడిపోయింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌‌కుమార్‌‌ నియోజకవర్గమైన అలంపూర్‌‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌‌ ఓడిపోయినా వడ్డేపల్లిలో విజయం సాధించింది. అయిజాలో ఆరు స్థానాలు సంపాదించినా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నామని, వైస్‌‌ చైర్మన్‌‌ పదవి సాధిస్తామని సంపత్‌‌ తెలిపారు. కాగా నల్గొండ, ఖానాపూర్‌‌, యాదగిరిగుట్ట, నేరేడుచర్ల, చేర్యాల, కోస్గిలో టీఆర్‌‌ఎస్‌‌తో సమానమైన స్థానాలు సాధించింది. కొన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌కు మధ్య స్వల్పమైన తేడా ఉంది. ఈ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు/రెబెల్స్‌‌ ఎవరికి సపోర్ట్‌‌ చేస్తారనే విషయం తేలాల్సి ఉంది. అదే సమయంలో కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌‌, ఇండింపెంట్లకు మద్దతు పలకడం ద్వారా అక్కడ అధికారం పంచుకునే అవకాశం ఉంది.