ములుగు (గోవిందరావుపేట), వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. గ్రామంలో మొత్తం 14 వార్డులు ఉండగా.. 4,542 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో నామినేషన్ వేసిన మేకల రాధ సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యారు. అలాగే 14 వార్డుల్లో 11 వార్డులు సైతం ఏకగ్రీవం కాగా.. మూడు వార్డుల్లోనే ఎన్నికలు జరుగనున్నాయి.
ఒకటవ వార్డులో బీజేపీ తరఫున, పదో వార్డులో కాంగ్రెస్, 11వ వార్డులో బీఆర్‌ఎస్ తరఫున క్యాండిడేట్లను పోటీలో నిలిపి.. ఇండిపెండెంట్లు తప్ప మిగతా వారి నామినేషన్లను విత్‌డ్రా చేయించారు. తర్వాత మూడు పార్టీల నాయకులు కలిసి జెండాలు పట్టుకొని ఆయా వార్డుల్లో తిరుగుతూ.. ఉమ్మడిగా పోటీ చేస్తున్న క్యాండిడేట్లను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఏకగ్రీవమైన 11 వార్డులను సైతం మూడు పార్టీలను పంచుకున్నాయి.

