8 ఉప ఎన్నికల్లో చెరో రెండుచోట్ల గెల్చిన కాంగ్రెస్, బీజేపీ

8  ఉప ఎన్నికల్లో చెరో రెండుచోట్ల గెల్చిన కాంగ్రెస్, బీజేపీ

న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ ఎలక్షన్స్‎తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన 8 అసెంబ్లీ బై ఎలక్షన్స్‎లో కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించింది. తెలంగాణలోని జూబ్లీహిల్స్‎లో, రాజస్థాన్‎లోని అంటా నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. జమ్మూ కాశ్మీర్‎లో నగ్రోటా అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా, ఒడిస్సాలోని నౌపడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జై ధోలాకియా ఘన విజయం సాధించారు. పంజాబ్‏లో తన స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. టార్న్ తరణ్​ సీటుకు జరిగిన బైపోల్‎లో ఆప్ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు విజయం సాధించారు. 

అలాగే, జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి, జేఎంఎం సీనియర్ నేత రాందాస్ సోరెన్ మృతితో ఘాట్సిలా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార జేఎంఎం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన సోమేశ్ చంద్ర సోరెన్  38,601 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

మిజోరంలోని డంపా అసెంబ్లీ నియోజకవర్గంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా మరణంతో ఉప ఎన్నిక జరిగింది. అదే పార్టీకి చెందిన లాల్తాంగ్లియానా విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్‏లోని బుద్గాం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతజీర్ మెహదీ విజయం సాధించారు.