
- కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం 16 లేదంటే 17న పీఏసీ మీటింగ్
- 18న కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన?
- ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు
- ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30లోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతున్నది. ఇన్నాళ్లూ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే లోకల్‌బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులతో పాటు పంచాయతీరాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను సైతం రాష్ట్రపతి పక్కనపెట్టడం, ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే! దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది.
ఎట్టిపరిస్థితుల్లోనూ హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్30లోగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్.. - ఈ నెల14న పంచాయతీ రాజ్‌శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని వివరాలతో హాజరుకావాలని పీఆర్ఆఫీసర్లకు మంగళవారమే సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. పార్టీ తరఫున రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పెద్దల అభిప్రాయాలు తీసుకునేందుకు 16న లేదంటే 17న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఏర్పాటు చేయాలని సోమవారమే పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు సీఎం సూచించారు.
పీఏసీ మీటింగ్ తర్వాత ఒకటి, రెండు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన చేస్తారని, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్షెడ్యూల్జారీ చేసే అవకాశముందని అధికారవర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సర్కారు నుంచి వస్తున్న సంకేతాలతో ఈసీ కూడా ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. పోలింగ్‌కోసం గుజరాత్ నుంచి -రాష్ట్రానికి 37,530 బ్యాలెట్‌బాక్సులను తెప్పిస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి.
ఇక పార్టీ తరఫునే బీసీ రిజర్వేషన్లు..
బీసీ బిల్లులు, పంచాయతీ రాజ్చట్టసవరణ ఆర్డినెన్స్‌ను కేంద్రం ఆమోదించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. నిజానికి బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించకుంటే రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లా లని ప్రభుత్వం భావించింది. కానీ నాటి బీఆర్ఎస్ సర్కారు 2018 లో తెచ్చిన పంచాయతీరాజ్చట్టంలోని సెక్షన్ 285 ఏ ఇందుకు అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లో 50 శాతం మించరాదని ఈ నిబంధన స్పష్టం చేస్తున్నది. దీంతో నెల క్రితమే ఈ నిబంధనను మారుస్తూ రాష్ట్ర సర్కారు ఆర్డినెన్స్తేగా, దానిని సైతం ఇటు గవర్నర్, అటు రాష్ట్రపతి ఆమోదించలేదు. ఇక ప్రభుత్వం ముందు పార్టీపరంగా 42 రిజర్వేషన్లు ఇవ్వడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను తన నివాసానికి పిలిపించుకొని, కాంగ్రెస్‌తరఫున బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై చర్చించారు.
సీనియర్ల సలహా తీసుకునేందుకు 16 లేదంటే 17 తేదీల్లో పీఏసీ సమావేశం నిర్వహించాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌లో ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్నందున పీఏసీ అంగీకారం ఇక లాంఛనమే అని తెలుస్తున్నది. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లో (విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 18న) కేబినెట్లో చర్చించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై స్వయంగా సీఎం అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మిగిలిన పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని అదేరోజు రేవంత్కోరే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదీగాక తాము ప్రకటిస్తే అనివార్యంగా మిగిలిన పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయక తప్పదని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది.
ఆగిన కేంద్రం నిధులు
రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి దాదాపు18 నెలలు అవుతున్నది. 2024 ఫిబ్రవరిలో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 6 నెలల్లోగా ఎన్నికలు జరపా ల్సి ఉన్నా.. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించడంతో ఆల స్యమవుతూ వచ్చాయి. అనంతరం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు తీవ్రంగా శ్రమించింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో అత్యంత శాస్త్రీయంగా కులగణన చేపట్టింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 56.33 శాతం ఉన్నట్లు తేల్చింది.
ఈ ఎంపిరికల్డేటా ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లులను మార్చి17న ఉభయసభలు ఆమోదించాయి. కానీ, రెండు బిల్లులను రాష్ట్ర పతి ఆమోదించలేదు. దీని వల్ల ఎన్నికలు ఆలస్యం కాగా, పాలక వర్గాలు లేవనే సాకుతో పంచాయతీలకు కేంద్రం నిధులు ఆపేసింది. రాష్ట్రంలోని 12,760 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180 కోట్లు రావాల్సి ఉంది. కానీ,15 నెలలకు సంబంధించి దాదాపు రూ.2,700 కోట్లపైగా నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిదికాదని భావిస్తున్న సర్కారు హైకోర్టు విధించిన గడువులోగానే ఎన్నికలు నిర్వహించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నది.
గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు
లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ అవుతున్న ఈసీ అధికారులు తెలంగాణకు గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకొస్తున్నారు. గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో 37,692 బాక్సులు ఉండగా, రాష్ట్రానికి 37,530 బాక్సు లను తెప్పిస్తున్నారు. ఆదిలాబాద్‌కు 1,030, నల్గొండ 4,120, హనుమకొండ 1,380, జగిత్యాల 1,060, జయశంకర్ భూపాలపల్లి 600, కరీంనగర్ 730, ఖమ్మం 2,320, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ 950, మహబూ బాబాద్ 970, మంచిర్యాల 970, మెదక్ 1,110, ములుగు 650, నాగర్ కర్నూల్ 1,310, నారాయణపేట్ 840, నిర్మల్ 830, నిజామాబాద్ 3,440, పెద్దపల్లి 1,650, రాజన్న సిరిసిల్ల 1,470, రంగారెడ్డి 1,730, సంగారె డ్డి 1,590, సిద్దిపేట 1,420, సూర్యాపేట 1,700, వికారాబాద్ 1,460, వరంగల్ 1,110, యాదాద్రి భువనగిరి 1,260 బ్యాలెట్ బాక్సులను తెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాలకు ఈ బాక్సులు చేరుకున్నాయి.
రిపోర్ట్లు రెడీ చేస్తున్న అధికారులు
స్థానిక ఎన్నికలకు సర్కారు రెడీ అవుతున్నదనే సమాచారం నేపథ్యంలో ఈ నెల 14న సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ క్రమంలో జిల్లాలవారీగా ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రమే ఆరా తీశారు.
‘‘స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లున్నారు? మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లను గుర్తించారు? ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంత మంది సిబ్బంది అవసరం? రెండు, మూడు విడతల్లో నిర్వహించాల్సి వస్తే ఏయే జిల్లాల్లో, ఏయే దశల్లో నిర్వహించాలి? ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉందా? బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయా? అన్ని జిల్లా కేంద్రాలకు తరలించారా?’’ లాంటి వివరాలతో రిపోర్ట్ రెడీ చేస్తున్నారు.