= నిన్న బీఆర్ఎస్.. ఇవాళ కాంగ్రెస్
= ఆటోలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం
= నిన్న ఆటో ఎక్కిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్
= రెండు రోజుల క్రితం ఆటో తోలిన మినిస్టర్ పొన్నం
= ఏటా 12 వేలిచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని వెల్లడి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ఆటోపాలిటిక్స్ మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా బస్తీలు ఉండటం.. అందులో ఆటో డ్రైవర్లు ఎక్కువగా నివసిస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆటోవాలా ఓట్లే టార్గెట్ గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెండు రోజుల క్రితం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆటో నడిపారు. తాము ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. త్వరలోనే నెరవేర్చబోతున్నామని అన్నారు.
నిన్న (అక్టోబర్ 27) బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆటోలో ప్రయాణం చేసి డ్రైవర్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు మాత్రం కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నారు. ఫ్రీ బస్ కారణంగా ఆటోవాలాల జీవితాలు రోడ్డున పడ్డాయని విమర్శలు చేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ లో 'ఆటో పాలిటిక్స్' ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆటోడ్రైవర్ల సమస్యల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా వ్యవహరిస్తుండటం విశేషం.
జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నేతలు ఆటోలలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోగా ఇవాళ (అక్టోబర్ 28) మంత్రి సీతక్క ఆటోలో ప్రయాణించడం చర్చనీయాశంగా మారింది. కార్పొరేషన్ చైర్మన్ బండారు శోభారాణితో కలిసి ఆమె ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ల సమస్యలకు ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు.
పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆటో పాలిటిక్స్ పై చర్చ తెరమీదకు వచ్చింది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటాగా నడుస్తున్న ఆటో పాలిటిక్స్ లో ఎవరు విజయం సాధిస్తారు..? డ్రైవర్లు ఎవరి పక్షాన ఉన్నారనేది త్వరలోనే తేలనుంది.
