విజన్ పాలమూరు ‌‌‌‌ --2047 సీఎం సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు

విజన్ పాలమూరు ‌‌‌‌ --2047 సీఎం సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు
  • నూతనోత్సాహంలో కాంగ్రెస్​ శ్రేణులు
  • సీఎం కప్​ రెండో ఎడిషన్​ పోస్టర్​ ఆవిష్కరణ

మహబూబ్​నగర్, వెలుగు:మహబూబ్​నగర్​లోని ఎంవీఎస్​ కాలేజ్​ గ్రౌండ్​లో శనివారం నిర్వహించిన సీఎం సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడంతో.. మైదానం మొత్తం నిండిపోయింది. ముందుగా జడ్చర్ల మండలం చిట్టబోయిన్​పల్లికి చేరుకున్న సీఎం ట్రిపుల్​ ఐటీ భవనాలకు శంకుస్థాపన చేసి..  మహబూబ్​నగర్​లోని ఎంవీఎస్​ కాలేజ్​ వద్దకు చేరుకున్నారు. రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించనున్న గిరిజన బాలుర వసతి గృహ భవన నిర్మాణం, రూ. 220.94 కోట్లతో మహబూబ్ నగర్  నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరా పథకం,  రూ.603 కోట్లతో నగరపాలక సంస్థ పరిధిలో అండర్ ​గ్రౌండ్​ డ్రైనేజీ,  రూ.200 కోట్లతో మహబూబ్ నగర్  నియోజకవర్గానికి సంబంధించిన యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్, రూ 20.50 కోట్లతో ఎంవీఎస్  ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల అదనపు కాలేజీ కొత్త భవన నిర్మాణాలు, రూ.40  కోట్ల డీఎంఈ నిధులతో కొత్త నర్సింగ్  కాలేజ్​ భవనాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

ప్రసంగం అనంతరం రెండవ ఎడిషన్​ సీఎం కప్  రోలింగ్​ షీల్డ్, జెర్సీ, పోస్టర్​ను సీఎం ఆవిష్కరించారు. అలాగే నియోజకవర్గంలోని 1,100 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. జిల్లాలోని 4,281 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.356 కోట్ల బ్యాంక్  లింకేజీ చెక్కును సీఎం 
అందజేశారు.

విజన్​ పాలమూరు స్పష్టంగా ఉంది: యెన్నం

‘రైజింగ్  తెలంగాణ–2047’ మాదిరిగానే ‘విజన్  పాలమూరు–2047’ సీఎం మనసులో స్పష్టంగా ఉందని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. ఎంవీఎస్  డిగ్రీ కాలేజీని స్థాపించి 60 ఏండ్లు అయిందని, మహబూబ్‌‌నగర్  మున్సిపాలిటీగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో రూ.1,400 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం మహబూబ్‌‌నగర్  చేసుకున్న భాగ్యమన్నారు. పాలమూరు ఎడ్యుకేషనల్  హబ్​గా మారుతోందని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సహకారంతో మెడికల్  హబ్​గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే ఇంటర్  స్టేట్  టెర్మినల్  ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున  నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే మోడల్  జిల్లాగా పాలమూరు జిల్లాను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్​ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్  కె.శివసేనా రెడ్డి,  కలెక్టర్  విజయేందిర బోయి, నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులతో సీఎం ముఖాముఖి

జడ్చర్ల టౌన్: విద్యార్థులు హై టార్గెట్​ పెట్టుకొని కష్టపడి చదవాలని సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి సూచించారు. ప్రతి విద్యార్థికి హార్డ్​ వర్క్​, కమిట్​మెంట్​ అవసరమన్నారు. జడ్చర్ల మండలం చిట్టబోయిన్​పల్లి వద్ద ట్రిపుల్​ ఐటీ భవనాల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్​ను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ట్రిపుల్​ ఐటీ విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్​లో మాట్లాడి ఆకట్టుకున్నారు. విద్యార్థులు సీఎంను, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. స్టూడెంట్లు ఐఏఎస్, ఐపీఎస్​లు కావాలనేది తమ డ్రీమ్​ అని చెప్పడంతో.. మంత్రి దామోదర రాజనర్సింహ పక్కనే ఉన్న ఎడ్యుకేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ యోగిత రాణా, కలెక్టర్​ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకీని పిలిచించి ఐఏఎస్​, ఐపీఎస్​లుగా వారి అనుభవాలను పిల్లలకు వివరించాలని కోరారు. 

సీఎం మాట్లాడుతూ ట్రిపుల్​ ఐటీ క్యాంపస్​ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. విద్యార్థులు జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా.. కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని మరిచిపోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగడానికి హార్ట్​వర్క్, కమిట్​మెంట్​ అవసరమన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రభుత్వ బడిలోనే తాను చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్​ శ్రీవిద్య మాట్లాడుతూ ట్రిపుల్​ ఐటీ రావడంతో ఇక్కడ పీయూసీ చదివే అవకాశం దక్కిందని చెప్పగా, గతంలో ట్రిపుల్​ ఐటీ చదివేందుకు ఏపీలోని నుజివీడు లేదంటే బాసర వెళ్లాల్సి వచ్చేదని స్టూడెంట్​ ఆరాధ్య తెలియజేసింది.