నెహ్రూతో మోదీకి పోలికా.. ? ఇది స్వయం ప్రకటిత మైలురాయి.. : కాంగ్రెస్

నెహ్రూతో మోదీకి పోలికా.. ? ఇది స్వయం ప్రకటిత మైలురాయి.. : కాంగ్రెస్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రికార్డుపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇది స్వయం ప్రకటిత, సందేహాస్పదమైన మైలురాయి అని పేర్కొంది. ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడికి గురవుతున్నాయని, ఆయన దేశ ప్రగతికి అడ్డంకిగా మారారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. నెహ్రూ హయాంలో  దేశ నిర్మాణం, రాజ్యాంగ రూపకల్పన, అభివృద్ధిని రమేశ్ గుర్తుచేస్తూ, ప్రస్తుత పరిస్థితులతో పోల్చారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదని, కాబట్టి ఇది బలమైన తీర్పు కాదన్నారు.

నెహ్రూతో మోదీకి పోలికా?: శరద్ పవార్   

ప్రధాని మోదీని తొలి ప్రధాని జవహర్‌‌లాల్ నెహ్రూతో పోల్చడంపై ఎన్‌‌సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. దేశానికి నెహ్రూ సాధించిన విజయాలు, ఆయన చేసిన కృషి అసమానమైనవని పేర్కొన్నారు. 

ముంబైలో ఎన్‌‌సీపీ(ఎస్పీ)  27వ స్థాపన దినోత్సవం సందర్భంగా పవార్ మాట్లాడారు. “ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పదవిని చేపట్టి 12 సంవత్సరాలు అయింది.  ఇది ముఖ్యమైనదే. కానీ దీనిని నెహ్రూతో పోల్చవచ్చా? నెహ్రూ సాధించిన విజయాలు, చేసిన కృషితో మోదీ పాలనను  పోల్చగలమా?” అని ఆయన ప్రశ్నించారు.