- పాల్గొననున్న ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఓటర్ బేస్‌ను బలోపేతం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల18న ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనుంది. దీనికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు సర్ రెండో విడత ప్రక్రియ జరుగుతున్న ప్రాంతాల్లోని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీల్పీ నేతలు, సెక్రటరీలు అటెండ్ కానున్నారు.
ఈ మీటింగులో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రాసెస్ తోపాటు వచ్చే ఏడాది(2026) అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్ రిజిస్ట్రేషన్‌ను పెంచడం, ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ పై క్లెయిమ్స్, అభ్యంతరాలు వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు. భవిష్యత్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను రూపొందించనున్నారు.
ప్రస్తుతం చత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ద్వీపాలు, లక్షద్వీప్‌లలో సర్ ప్రక్రియ జరుగుతోంది. అయితే, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలు మంగళవారం సమీక్ష జరపనున్నారు. ఓటర్ డిలీషన్, డూప్లికేట్ ఎంట్రీలపై చర్చించనున్నారు.
