హరీశ్​రావును చూస్తే .. అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయ్ : తీన్మార్​ మల్లన్న

హరీశ్​రావును చూస్తే  .. అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయ్ : తీన్మార్​ మల్లన్న

మెదక్, వెలుగు: హరీశ్​రావును చూస్తే అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయని కాంగ్రెస్​ ప్రచార కమిటీ కన్వీనర్​ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మెదక్ నవాపేటకు చెందిన మున్సిపల్​ కౌన్సిలర్​ దొంతి లక్ష్మి, మాజీ కౌన్సిలర్​ ముత్యంగౌడ్​ దంపతులు మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తీన్మార్​ మల్లన్న హాజరై మాట్లాడారు. 

మంత్రి హరీశ్ రావు​ పొద్దున లేచిన నుంచి అన్నీ అబద్ధాలే మాట్లాడుతారని ధ్వజమెత్తారు. మెదక్ లో ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరో అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నపుడు నాగార్జున సాగర్, సింగూర్​ ప్రాజెక్ట్ కట్టారని, వాటికి ఇప్పటి వరకు కనీసం పగుళ్లు కూడా రాలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్​ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజి​ ఏడాది లోపే కుంగిపోయిందన్నారు. 

ALSO READ: బీసీ లీడరే ముఖ్యమంత్రి : రఘునందన్ రావు 

అలాగే కేసీఆర్​ ప్రభుత్వం కట్టిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు కుక్కతోక తాకినా కూలిపోయేటట్టున్నాయని ఆరోపించారు. మెదక్ నియోజకవర్గంలో పేదలెవరికీ డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు రాలేదు కానీ, కేసీఆర్​ మాత్రం తొమ్మిదెకరాల్లో బంగ్లా కట్టుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​నాయకులు సురేందర్​ గౌడ్, జీవన్​ రావు,  ప్రశాంత్​ రెడ్డి, ప్రవీణ్​ గౌడ్, బొజ్జ పవన్, ఉప్పల రాజేశ్, సుభాష్​ చంద్రబోస్ ఉన్నారు.