కేసీఆర్​ అన్ని వర్గాలను మోసం చేసిన్రు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కేసీఆర్​ అన్ని వర్గాలను మోసం చేసిన్రు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్/కుసుమంచి/ఖమ్మంటౌన్, వెలుగు : తెలంగాణలో సీఎం కేసీఆర్​ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని పాలేరు కాంగ్రెస్​అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి ని చేసినా ఇప్పటి వరకు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇళ్ళు, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను చిత్తుగా ఓడిపోనుందని చెప్పారు. కేసీఆర్​ను ప్రజలు ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని కోరారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి రూ.12 వేలు ఆర్థికసాయం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి మహిళకు రూ.2500 అందిస్తామని, గ్యాస్​ సిలిండర్​ రూ.500కే అందిస్తామని హామీ ఇచ్చారు. 

అక్రమ కేసులు ఎత్తివేస్తాం.. 

ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని కైకొండాయిగూడెం ఒకటో డివిజన్ కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, సుమారు వెయ్యికి పైగా కుటుంబాలు నాగటి ఉపేందర్ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరాయి.  వారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మలతో కలిసి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్​ కార్యకర్తలపై పెట్టించిన అక్రమ కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు.

ఈ విషయమై తనతోపాటు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు అనేక వేదికలపై కార్యకర్తలకు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రాంరెడ్డి చరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ, కన్నేటి వెంకన్న,  బైరు హరినాథ్ బాబు, మద్ది వీరారెడ్డి, బోడ వీరన్న, నాగాటి రాజు, భూక్య ఉపేందర్, శీలం వెంకన్న, సీహెచ్ వీరస్వామి, అక్కిరామయ్య, పందుల శివరాం రామయ్య పాల్గొన్నారు.

వెజ్ మార్కెట్​లో ప్రచారం..

ఖమ్మం సిటీలోని హోల్ సెల్ వెజ్ టేబుల్ మార్కెట్ లో గురువారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హోల్ సేల్ వ్యాపారులు పొంగులేటిని ఘనంగా సత్కరించారు. వ్యాపారుల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కూరగాయల తూకం వేశారు. టిఫిన్ సెంటర్ లో దోశలు వేశారు. కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు.