- కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ క్షేత్ర స్థాయి కార్యక్రమాలు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం గడువు మే10తో ముగుస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో పలు పార్టీల నాయకులు అభ్యర్థుల వేటలో మునిగారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 1,28, 500 ఓటర్లుండగా మొత్తం 43 వార్డులున్నాయి. గత రెండు దశాబ్దాలుగా సిద్దిపేట బల్దియాపై బీఆర్ఎస్ విజయం సాధిస్తుండగా ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలనే దిశగా కాంగ్రెస్, బీజేపీలు కసరత్తును ప్రారంభించాయి.
2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 36, ఐదుగురు ఇండిపెండెంట్లు, బీజేపీ, ఎంఐఎం ఒక్కో వార్డులో విజయం సాధించారు. గెలుపొందిన ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ లో చేరారు. మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నలుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం గమనార్హం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను గమనిస్తే సిద్దిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీలు క్రమంగా బలపడుతుండడం కనిపిస్తోంది.
ప్రతిపక్షాలకు చిక్కని పట్టు
సిద్దిపేట బల్దియాలో ప్రతిపక్ష పార్టీలకు పట్టు చిక్కడం లేదు. గత రెండు దశాబ్దాల కాలంగా కాంగ్రెస్, బీజేపీలు అన్ని స్థానాలకు పోటీ చేసినా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. అన్ని స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని బీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో ప్రయత్నించినా విఫలమైంది. మరోవైపు ఇప్పటి నుంచే వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను అమలు చేయడం లేదని బాకీ కార్డులతో బీఆర్ఎస్, ఇచ్చిన వాగ్ధానాలను బీఆర్ఎస్ అమలుచేయలేదని దోకా కార్డులతో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.
పక్షం రోజుల కింద 14 వ వార్డులో ఒకే రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాలు నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీతో మంచి జోష్ లో ఉన్న బీజేపీ పార్టీని మరింత పటిష్టం చేసే పనిలో నిమగ్నమైంది. పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు సహకరిస్తూ కోవర్ట్ రాజకీయాలు చేసిన వారిని గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే ఓ నేతపై సస్పెన్షన్ వేటు సైతం వేసింది.
చైర్మన్పదవి బీసీ జనరల్ రిజర్వ్
సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్ గా రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీల నుంచి చైర్మన్ పదవిని ఆశిస్తున్న నేతలు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఆయా పార్టీల తరపున ఫ్లెక్సీలు, పోస్టర్లు, పాంప్లెట్స్ తో వార్డు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్న వారు ఆరు గ్యారంటీలతో కరపత్రాలు, పోస్టర్ల తో ప్రచారం ప్రారంభించగా, బీజేపీ, బీఆర్ఎస్ ఆశావహులు సైతం తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వార్డు రిజర్వేషన్లు మారే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా అభ్యర్థులను గుర్తించే పనిలో పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. మరోసారి బల్దియా పీఠాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో కొత్త వారిని ఎక్కువగా రంగంలోకి దించే అవకాశం కనిపిస్తోంది.
