స్కీమ్‌‌‌‌‌‌‌‌లన్నింటికీ ఏఐ టెక్నాలజీ!.ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితా అప్‌‌‌‌‌‌‌‌డేట్

స్కీమ్‌‌‌‌‌‌‌‌లన్నింటికీ  ఏఐ టెక్నాలజీ!.ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితా అప్‌‌‌‌‌‌‌‌డేట్
  • ప్రాథమిక స్థాయిలో వినియోగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం
  • డూప్లికేషన్ గుర్తింపు.. ఇతర శాఖలతో లింక్ చేసి డెత్‌‌‌‌‌‌‌‌ లిస్ట్ అవుట్
  • ఉద్యోగులు, అనర్హులు స్కీమ్స్‌‌‌‌‌‌‌‌ పొందుతున్నట్టు నివేదికల వెల్లడి
  • ఢిల్లీ సమిట్ తర్వాత రాష్ట్రంలో 
  • పథకాల అమల్లో ఏఐ టెక్నాలజీ ఎంట్రీకి సీఎం గ్రీన్​ సిగ్నల్​
  • నిజమైన అర్హులకే  పథకాలు అందేలా ప్లాన్ 
  • ఇప్పటికే ఐటీ శాఖ  ప్రాథమిక సంప్రదింపులు పూర్తి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ప్రాథమిక స్థాయిలో వినియోగించాలని రాష్ట్ర సర్కారు సూత్రపాయంగా నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తూ, నిజమైన అర్హులకే సంక్షేమం అందేలా ఏఐని వాడుకోవాలని డిసైడ్​ అయింది. ఎప్పటికపుడు లబ్ధిదారుల జాబితాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయడం (కొత్తవి ఎంట్రీ చేయడం), డూప్లికేషన్ తీసేయడం, ఇతర శాఖలతో అనుసంధానమై డెత్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను వేరుచేయడం లాంటివి ఈ టెక్నాలజీతో సులభతరం కానున్నాయి. ఎకనామిక్ సర్వే, 16వ ఆర్థిక సంఘం నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన  సోషల్ ఆడిట్‌‌‌‌‌‌‌‌లలో పెద్ద ఎత్తున అనర్హులకు స్కీమ్‌‌‌‌‌‌‌‌లు అందుతున్నాయని స్పష్టమైన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. 

ఇటీవల ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ వివరాలు దాచిపెట్టి సర్కారు స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తీసుకుంటున్నట్లు వెల్లడి కావడం యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే అక్రమాలకు చెక్ పెట్టి, నిజమైన అర్హులకు పూర్తిస్థాయిలో పథకాల లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నది. ఈ మేరకు సాంకేతిక సహకారం, విధివిధానాల రూపకల్పన కోసం రాష్ట్ర ఐటీ శాఖతో వివిధ విభాగాల ఉన్నతాధికారుల ప్రాథమిక సంప్రదింపులు కూడా చేసినట్టు సమాచారం.  ఢిల్లీలో ఏఐ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయిన వెంటనే, రాష్ట్రంలో స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏఐని అధికారికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీతో రెవెన్యూ, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి శాఖల్లో చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఏఐ స్టార్టప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్న తెలంగాణ, నాస్కామ్ నివేదిక ప్రకారం జనరేటివ్ ఏఐ నిధుల్లో 7 శాతం వాటాతో బెంగళూరు (39%), ముంబై (14%), ఢిల్లీ (9%) తర్వాత నాలుగో స్థానంలో నిలవడం విశేషం.

సంక్షేమానికి ‘ఏఐ’ కవచం

రాష్ట్రంలో ఏండ్లుగా సాగుతున్న సంక్షేమ పథకాల అమలులో పేరుకుపోయిన లొసుగులు ప్రభుత్వ ఖజానాకు ఏటా వేల కోట్ల రూపాయల మేర భారీ గండి కొడుతున్నాయి. ఎకనామిక్ సర్వేతోపాటు 16వ ఆర్థిక సంఘం నివేదికలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ నిధుల దుర్వినియోగాన్ని కుండబద్ధలు కొట్టి వాస్తవాలను ప్రభుత్వాల ముందుంచాయి. అనర్హులు దర్జాగా లబ్ధి పొందుతుండగా, నిజమైన పేదలకు మాత్రం పథకాలు అందడం లేదని  సోషల్ ఆడిట్ నివేదికలు సైతం స్పష్టం చేశాయి. నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు, ఉచిత పథకాలను అక్రమంగా పొందుతున్నారన్న వార్తలు సర్కారును ఉలిక్కిపడేలా చేశాయి. మరణించిన వ్యక్తుల పేర్ల మీదుగా ఏళ్ల తరబడి పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు డ్రా చేస్తున్న ముఠాల ఆగడాలకు క్షేత్రస్థాయిలో అంతేలేకుండా పోయింది. ఆధార్, రేషన్ కార్డుల వివరాలను తప్పుగా నమోదు చేసి ఒకే కుటుంబంలో డూప్లికేషన్ ద్వారా అనేక పథకాలు పొందుతున్న బోగస్ లబ్ధిదారుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటున్నది. ఇలాంటి అనర్హులను మాన్యువల్ పద్ధతిలో గుర్తించడం అధికారులకు సాధ్యం కాకపోవడంతోనే.. ఇక ఏఐ టెక్నాలజీని ఆశ్రయించడం తప్ప సర్కారుకు మరో మార్గం కనిపించడం లేదు.  

ఒకే క్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పక్కాగా డేటా అనుసంధానం

ప్రభుత్వ స్కీముల్లో ఏఐ టెక్నాలజీ ఎంట్రీతో పరిపాలనలో, లబ్ధిదారుల ఎంపికలో విప్లవాత్మకమైన పారదర్శకత రానుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఏఐ ఆల్గారిథమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెవెన్యూ, మున్సిపల్, వైద్య, పంచాయతీ రాజ్, సివిల్ సప్లైస్ శాఖల డేటాబేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నింటినీ ఒకే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ పైకి తీసుకొచ్చి అనుసంధానం చేయనున్నారు. ఉదాహరణకు పంచాయతీల్లో మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయిన మరుక్షణమే, ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సంక్షేమ శాఖల పోర్టళ్లలో ఆ వ్యక్తి పేరు డెత్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లిపోయి స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతాయి. ఎప్పటికపుడు లబ్ధిదారుల జాబితాలను ఏఐ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నిరంతరం అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేస్తూ, వయసు లేదా అర్హత సాధించిన కొత్త వారి పేర్లను ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జతచేసేలా ప్లాన్ చేస్తున్నారు. పేర్లు, చిరునామాలు మార్చి డూప్లికేషన్ ద్వారా రెండుసార్లు లబ్ధి పొందాలని చూస్తే, డేటా మ్యాచింగ్ ద్వారా ఏఐ దాన్ని క్షణాల్లో పసిగట్టి రెడ్ మార్క్ వేస్తుంది. ఈ సరికొత్త విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేయడానికి, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ పటిష్టతపై ఐటీ శాఖతో జరిగిన ప్రాథమిక సంప్రదింపులు అత్యంత సానుకూలంగా ముగిశాయి. సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుని రాష్ట్రంలో ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అధికారికంగా రోల్ అవుట్ చేయనున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల ప్రమేయం లేకుండా కేవలం అర్హత ప్రాతిపదికన ఏఐ ద్వారా లబ్ధిదారుల పారదర్శక ఎంపిక జరిగేలా ఈ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేస్తున్నారు.

ఏఐ స్టార్టప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మనదే హవా!

నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ‘జనరేటివ్ ఏఐ’ స్టార్టప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో  7 % నిధులు ఒక్క తెలంగాణకే దక్కుతున్నాయి. ఏఐ స్టార్టప్స్ పెట్టుబడుల ఆకర్షణలో ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరొందిన బెంగళూరు (కర్నాటక) అత్యధికంగా 39 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆ తర్వాత స్థానాల్లో ముంబై (మహారాష్ట్ర) 14 శాతంతో రెండో స్థానంలో, ఢిల్లీ 9 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. ఆ మూడు అగ్రగామి నగరాల తర్వాత అత్యధికంగా 7 శాతం వాటాతో తెలంగాణలోని స్టార్టప్స్ ఈ అత్యున్నత సాంకేతిక రంగంలో అద్భుతంగా రాణిస్తూ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.