కాంగ్రెస్ ​చీఫ్ ఎవరు​? కొనసాగుతున్న ఉత్కంఠ

కాంగ్రెస్ ​చీఫ్ ఎవరు​? కొనసాగుతున్న ఉత్కంఠ
  • కౌన్​ బనేగా కాంగ్రెస్ ​చీఫ్​?
  • కొనసాగుతున్న ఉత్కంఠ.. పోటీ చేస్తానన్న గెహ్లాట్
  • రాజస్థాన్ కొత్త సీఎం ఎంపిక సోనియా చూస్కుంటరని వెల్లడి 
  • రేసులో థరూర్, కమల్ నాథ్, ఖర్గే ఉన్నట్లు ప్రచారం  
  • అధికార ప్రతినిధులు కామెంట్లు చేయొద్దన్న జైరాం రమేశ్

కొచ్చి / న్యూఢిల్లీ:   కాంగ్రెస్ పార్టీకి రెండు దశాబ్దాల తర్వాత గాంధీయేతర ప్రెసిడెంట్ ఎన్నికయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఇప్పటికే నో చెప్పడంతో గాంధీ కుటుంబం కాకుండా బయటి వ్యక్తి పార్టీ పగ్గాలను చేపట్టడం ఖాయమైపోయింది. మరోవైపు పార్టీ సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, మనీశ్ తివారీ తదితరులు బరిలో ఉన్నారన్న ప్రచారం కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా తాను పోటీ చేయడంలేదంటూ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. పార్టీ ప్రెసిడెంట్ పదవికి తాను పోటీ చేస్తున్నట్లు గెహ్లాట్ శుక్రవారం ప్రకటించారు. దీంతో పార్టీ ఎన్నికల బరిలో గెహ్లాట్, థరూర్ నిలిచే చాన్స్​ కన్పిస్తున్నది.  రెడీ అన్న గెహ్లాట్ పార్టీలో ‘ఒక వ్యక్తికి, ఒకే పదవి’ అన్న నిర్ణయం తీసుకోవడంతో రాజస్థాన్ సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధమైన గెహ్లాట్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. శుక్రవారం కేరళలోని కొచ్చిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్​కు వెళ్లిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం నామినేషన్ వేస్తానని వెల్లడించారు. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తదితరులు కూడా పార్టీ చీఫ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని వస్తున్న వార్తలపై గెహ్లాట్ స్పందిస్తూ.. ‘‘వారంతా కాంగ్రెస్​లోని మా మిత్రులు. వారు పోటీ చేసినా, అదేం పెద్ద విషయం కాదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్లీ అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తాం” అని చెప్పారు. 

ఇంట్రెస్ట్ లేదన్న దిగ్విజయ్  

కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తనకు ఇంట్రెస్ట్ లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. పార్టీ ప్రెసిడెంట్ పదవికి తాను పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం సూచనలను పాటిస్తానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని ఓ మసీదు, మదర్సాను సందర్శించడంపై మీడియా ప్రశ్నించగా.. అది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎఫెక్టేనన్నారు. యాత్రకు పార్టీ ఊహించినదానికన్నా ఎక్కువ స్పందన వస్తోందన్నారు. 

క్యాండిడేట్లపై కామెంట్లు చేయొద్దు: జైరాం 

కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికకు బరిలోకి దిగుతున్న క్యాండిడేట్లపై పార్టీ అధికార ప్రతినిధులు, కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ బేరర్లు ఎలాంటి కామెంట్లు చేయొద్దని శుక్రవారం ఏఐసీసీ కమ్యూనికేషన్స్ ఇన్ చార్జ్ జైరాం రమేశ్ ఆదేశించారు. ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ప్రెసిడెంట్ ను ఎన్నుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధికార ప్రతినిధులకు ఆయన సూచించారు. 

‘వన్ మ్యాన్, వన్ పోస్ట్’పై చర్చ అనవసరం 

పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ‘వన్ మ్యాన్, వన్ పోస్ట్’ కామెంట్​పై గెహ్లాట్ స్పందిస్తూ.. దీనిపై చర్చ అవసరం లేదన్నారు. తన స్థానంలో కొత్త సీఎం ఎంపిక విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్​చార్జ్ అజయ్ మాకెన్, పార్టీ చీఫ్ సోనియా గాంధీ చూసుకుంటారని చెప్పారు. శుక్రవారం షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన తర్వాత సీఎం పదవికి స్పీకర్ సీపీ జోషిని ఎంపిక చేయాలంటూ గెహ్లాట్ సిఫార్సు చేశారన్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.