ఎన్డీయే వైఫల్యాలపై కాంగ్రెస్​ బ్లాక్​ పేపర్​ 

ఎన్డీయే వైఫల్యాలపై కాంగ్రెస్​ బ్లాక్​ పేపర్​ 

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ పదేండ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే ఉన్నాయంటూ గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్​ఖర్గే బ్లాక్ పేపర్ రిలీజ్ చేశారు. యూపీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ పతనమైందని, తాము వచ్చాకే మెరుగుపడిందంటూ కేంద్ర ప్రభుత్వం ఎకానమీపై వైట్ పేపర్ ను రిలీజ్ చేయడానికి ముందే కాంగ్రెస్ తరఫున ఆయన బ్లాక్ పేపర్ విడుదల చేశారు. అనంతరం సభలో ఆయన మాట్లాడారు.

దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ప్రధాని మోదీ మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు. ‘‘పదేండ్లలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో మోదీ ప్రభుత్వం ఎప్పటికీ చెప్పదు. అందుకే మోదీ సర్కారు వైఫల్యాలపైనే బ్లాక్ పేపర్ రిలీజ్ చేశాం. రాష్ట్రాలకు మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను రిలీజ్ చేయడంలోనూ మోదీ వివక్ష చూపుతున్నారు.

ఇన్​ఫ్లేషన్ భారీగా పెరిగిపోయింది. కంట్రోల్ చేసేందుకు మీరేం చేశారో చెప్పండి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడ్డారు. పేదోడు, ఉన్నోడని మీరే విభజించారు’’అని ఖర్గే మండిపడ్డారు. ఎన్డీయే సర్కారు హయాంలో బిల్లులపై చర్చలు జరగకుండానే చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేయించుకున్నారన్నారు. హడావుడిగా బిల్లులు పాస్ చేయొద్దని కోరారు. మాజీ ప్రధాని దేవేగౌడ తన జీవితమంతా సెక్యులరిజం, సోషలిజం, రైతుల కోసమే అంకితం చేశారని ఖర్గే కొనియాడారు.