కశ్మీర్​ ‘ఇంటర్నేషనల్‌ ఇష్యూ’నట… అడ్డంగా దొరికిన కాంగ్రెస్‌

కశ్మీర్​ ‘ఇంటర్నేషనల్‌ ఇష్యూ’నట… అడ్డంగా దొరికిన కాంగ్రెస్‌

సిమ్లా ఒప్పందం, లాహోర్​ డిక్లరేషన్ల మాటేంటని అధిర్ రంజన్‌ ప్రశ్న

సొంత లీడర్​ కామెంట్స్​పై సోనియా గాంధీ ఆశ్చర్యం

జమ్మూకాశ్మీర్​ రీఆర్గనైజేషన్​ బిల్లు –2019పై చర్చ సందర్భంగా కాంగ్రెస్​ లీడర్​ అధిర్​ రంజన్​ చౌధురి కామెంట్స్​తో  లోక్​సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. 1948 నుంచి యునైటెడ్​ నేషన్స్​(యూఎన్​)లో నానుతున్న కాశ్మీర్​ సమస్యను దేశ అంతర్గత అంశంగా కేంద్రం పరిగణించడాన్ని అధిర్​ ప్రశించారు. కాశ్మీర్​ ఇష్యూ రెండు దేశాలది కానప్పుడు మనం పాకిస్తాన్​తో  చేసుకున్న సిమ్లా ఒప్పందం, లాహోర్​ డిక్లరేషన్ల మాటేంటని అన్నారు. కాశ్మీర్​ ఇంటర్నేషనల్​ ఇష్యూనే అనే అర్థంలో అధిర్​ చేసిన కామెంట్స్​పై యూపీఏ చీఫ్​ సోనియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏం జరుగుతోందంటూ వెనుక బెంచ్​లో కూర్చున్న రాహుల్​కు సోనియా సైగలు చేశారు. ‘కాశ్మీర్​పై కాంగ్రెస్​ స్టాండ్​ ఇదేనా?’ అంటూ బీజేపీ ఎంపీలు గట్టిగా అరవడంతో అధిర్​ మరోసారి వివరణ ఇచ్చారు. ‘‘గవర్నమెంట్​ దగ్గర క్లారిటీ ఉందో లేదో తెల్సుకోవాలనే నేనీ ప్రశ్నలు అడిగాను. మాకేదో దేశభక్తి లేదన్నట్లు ప్రొజెక్ట్​ చెయ్యొద్దు. కాశ్మీర్​పై కాంగ్రెస్​కూ కమిట్​మెంట్​ ఉంది కాబట్టే పీవోకే కూడా ఇండియాలో భాగమేనని గతంలో తీర్మానం చేశాం’’అని చెప్పారు. కాంగ్రెస్​కే చెందిన మరో ఎంపీ మనీష్​ తివారీ మాట్లాడుతూ, కాశ్మీర్​ విభజన విషయంలో కేంద్రం రాజ్యాంగాన్ని అవహేళన చేసిందని, పార్లమెంట్​ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందని ఆరోపించారు. కాంగ్రెస్​ నేతల కామెంట్లకు కేంద్ర మంత్రి అమిత్​ షా బదులిస్తూ.. ‘‘కాశ్మీర్ ముమ్మాటికీ ఇండియాలో అంతర్భాగమని ఆర్టికల్​ 370లోని 1, సీ నిబంధనతోపాటు జమ్మూకాశ్మీర్​ రాజ్యాంగంలోనూ స్పష్టంగా రాసుంది. కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంట్​కు ఉంది. ఈ విషయంలో మమ్మల్నెవరూ ఆపలేరు. కాశ్మీర్​పై నిర్ణయం పొలిటికల్​ వ్యవహారం కాదు. కొత్త చట్టాల వల్ల రాబోయే రోజుల్లో మార్పులొస్తాయి’’అని చెప్పారు.

తీవ్ర పరిణామాలు తప్పవు: 370 రద్దుపై రాహుల్

జమ్మూకాశ్మీర్​కు చెందిన ప్రజాప్రతినిధుల్ని అక్రమంగా నిర్బంధించి, రాజ్యాంగ విరుద్ధంగా ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినంత మాత్రాన దేశంలో ఇంటిగ్రిటీ పెరగదని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. రాహుల్​ మంగళవారం లోక్​సభకు హాజరైనప్పటికీ జమ్మూకాశ్మీర్​ రీఆర్గనైజేషన్​ బిల్లుపై మాట్లాడలేదు. 370 రద్దు, కాశ్మీర్​ విభజనపై బీజేపీ నిర్ణయాల్ని సమర్థిస్తూ కాంగ్రెస్​ నేతలు కొందరు మాట్లాడటం పార్టీలో చర్చనీయాంశమైంది. ఒక చారిత్రక తప్పిదాన్ని బీజేపీ సర్కార్​ సరిచేసిందన్న కాంగ్రెస్​ నేత జనార్దన్​ ద్వివేది.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. కేంద్రం నిర్ణయంతో దేశానికి, జమ్మూకాశ్మీర్​కు మేలు జరుగుతుందని మరో సీనియర్​ నేత దీపేందర్​ హుడా అన్నారు.

బ్రెయిన్​లెస్​ కాంగ్రెస్​: మంత్రి నఖ్వీ ఫైర్​

గతంలో చేసిన తప్పుల్ని దిద్దుకోవాల్సిందిపోయి కాంగ్రెస్​ పార్టీ ఇంకొన్ని మరకలంటించుకుంటున్నదని కేంద్ర మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నక్వీ ఎగతాళి చేశారు. ‘‘హెడ్​లెస్(నాయకుడులేని)​ కాంగ్రెస్ ఇప్పుడు బ్రెయిన్​లెస్(మెదడులేని) పార్టీగానూ తయారైంది. ఓటమితో వచ్చిన ఫ్రస్ట్రేషన్​ వల్ల ఆ పార్టీ నేతలు మానసికంగా దివాళా తీశారు. అధిర్​ చౌధురి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా, సోనియా, రాహుల్ వారించకపోవడం ఇంకా దారుణం”అని నక్వీ విమర్శించారు.

తప్పును దిద్దడానికి మళ్లీ తప్పు చేశారు

ఆర్టికల్‌​370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల్ని, పార్టీల్ని కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సర్కారు తీరును నిరసిస్తూ టీఎంసీ ఎంపీలు వాకౌట్​ చేశారు. మెజార్టీ ఉందికదాని బీజేపీ ఇష్టారీతిగా బిల్లుల్ని పాస్​ చేయించుకుంటున్నదని, జమ్మూకాశ్మీర్​ని రెండు మున్సిపాలిటీలుగా విభజించారని డీఎంకే ఎంపీ టీఆర్​ బాలు విమర్శించారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. అసలు జమ్మూకాశ్మీర్​ని ఎందుకు విభజించారో అర్థంకావడంలేదన్నారు. ‘‘గతంలో ఏదో తప్పు జరిగిందని, దాన్ని సవరించడానికి మళ్లీ తప్పుడు మార్గాన్నే ఎంచుకుటే ఎలా? గత ప్రభుత్వానికి, ఇప్పటి సర్కారుకు తేడా ఏముంది? ఫ్రీ ఎలక్షన్స్​ గురించి మాట్లాడే బీజేపీ లడక్​కు అసెంబ్లీ ఎందుకివ్వలేదు?’’అని సుప్రియ ప్రశ్నించారు.

 

బక్రీద్​కి కాశ్మీరీలనే బలికమ్మంటారా: అసదుద్దీన్​ ఓవైసీ 

ఆర్టికల్​ 370 ఎత్తివేత చారిత్రక తప్పిదమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ అన్నారు. ‘‘సోమవారం బక్రీద్​ పండుగ ఉంది. మేకలు, గొర్రెలకు బదులు కాశ్మీరీలు తమను తామే బలిచ్చుకోవాలని మోడీ సర్కార్​ ఆశిస్తున్నదా? ఒకవేళ అదే మీ కోరికైతే కాశ్మీరీలు దేనికీ భయపడరు. ఆర్టికల్​ని రద్దు చేసి బీజేపీ తన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నా, రాజ్యాంగ విలువల్ని మాత్రం పాతరేసింది’’అని ఓవైసీ విమర్శించారు. కాశ్మీర్​ విషయంలో మోడీ సర్కారు నిర్ణయం సరైందేనని వచ్చే ఐదేండ్లలోనే తెలిసొస్తుందని అమిత్​ షా కౌంటరిచ్చారు.

అధికారం ఉందికదాని దుర్వినియోగం చేస్తున్నరు: రాహుల్ గాంధీ ట్వీట్
ఈ దేశాన్ని ఒక్కటిగా ప్రజలే నిర్మించుకున్నారు తప్ప ముక్కలైన భూభాగాలతో ఈ దేశం ఏర్పడలేదు.. దీన్ని ఒక్కటిగా ప్రజలే నిర్మించుకున్నారు. చేతిలో అధికారం ఉందికదాని దుర్వినియోగం చేస్తే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.