సంకల్ప పత్రం కాదు..జుమ్లా పత్రం

సంకల్ప పత్రం కాదు..జుమ్లా పత్రం
  • పాత హామీలకు జవాబుదారీతనం లేదు.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్​ విమర్శ
  • బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ ​
  • రైతులు, యువతకు బీజేపీ క్షమాపణ చెప్పాలి: ఖర్గే​
  • నిరుద్యోగులు బీజేపీ ఉచ్చులో పడరు: రాహుల్​
  • మోదీ గ్యారెంటీ కాదు.. జుమ్లాల వారంటీ: ఖర్గే

న్యూఢిల్లీ: బీజేపీది సంకల్ప పత్రం కాదని.. అది జుమ్లా పత్రం (అబద్ధాల పత్రం) అని కాంగ్రెస్​ విమర్శించింది. గత హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని మండిపడింది. బీజేపీ ఆదివారం విడుదల చేసిన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్​ చురకలంటించింది. ప్రధాని మోదీ గత హామీలను నెరవేర్చలేదని, మోదీ గ్యారంటీ కాదు.. ‘జుమ్లాల వారంటీ’ (అబద్ధాల వారంటీ) అని కాంగ్రెస్​ పార్టీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 

ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ద్రవ్యోల్బణం  అదుపులాంటి హామీలను మోదీ నెరవేర్చలేదని, ఇప్పుడు 2047 టార్గెట్​ పేరుతో మాటమారుస్తున్నారని మండిపడ్డారు.  బీజేపీ మేనిఫెస్టోకు ‘మాఫీనామా’ అని పేరుపెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. పదేండ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు దేశంలోని రైతులు, యువత, నిరుపేదలు, దళితులకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘దేశంలోని నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని డిమాండ్​ చేస్తున్నారు. ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాలే లేవు.’ అని ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి ట్విట్టర్​లో 14 ప్రశ్నలను సంధించారు. 

సంకల్ప పత్రం బూటకం: ప్రియాంకా గాంధీ

బీజేపీ సంకల్ప పత్రం బూటకమని కాంగ్రెస్​ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. వారి అసలు మేనిఫెస్టో ‘సంవిధాన్​ బద్​లో పత్ర’ (రాజ్యాంగాన్ని మార్చే పత్రం) అని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు ప్రతి వీధిలోనూ అంబేద్కర్​ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చెప్పుకొని తిరుగుతున్నారని ఆమె ట్విట్టర్​వేదికగా దుయ్యబట్టారు. బీజేపీ మేనిఫెస్టోలో 76 పేజీలు.. 53 కెమెరాజీవి (మోదీ) ఫొటోలు ఉన్నాయని, పదేండ్లలో దేశాన్ని అన్నిరకాలుగా వంచించిన వ్యక్తికి ఇది వీడ్కోలు సందర్భంలాగా ఉన్నదని కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ జైరాం రమేశ్​ చురకలంటించారు.  ​  

పదేండ్లలో ఏమి చేశారో చెప్పాలి: సిద్ధరామయ్య

బీజేపీ మేనిఫెస్టో రిలీజ్​ చేయడం కాదు.. పదేండ్లలో వాళ్లు ఏం చేశారో దేశ ప్రజలకు చెప్పాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్​ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు అనే హామీలు ఇచ్చి  నెరవేర్చలేదని.. వారు భవిష్యత్తులోనూ ఏ హామీని నెరవేర్చబోరని అన్నారు. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు. 

నిరుద్యోగ సమస్యను విస్మరించారు: తేజస్వీ​

 బీజేపీ మేనిఫెస్టోలో నిరుద్యోగంతోపాటు రైతులు, ద్రవ్యోల్బణంలాంటి సమస్యలను విస్మరించారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​అన్నారు. మేనిఫెస్టోలో ఉద్యోగాలు, ఉపాధికి సంబంధించి ఎక్కడా ఊసే లేదని చెప్పారు.  దీన్ని బట్టి ప్రజలకు బీజేపీ ఏమీ చేయదని అర్థమైపోయిందన్నారు. ‘బిహార్​కు ప్రత్యేక హోదా ఏమైంది? ప్రత్యేక ప్యాకేజీ మాటేంటి? గత లోక్​సభ ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన వాగ్దానాలన్నీ వాగ్దానాలుగానే మిగిలిపోయాయి’ అని విమర్శించారు.  

గత హామీల మాటేమిటి?: ఆప్​

బీజేపీ మేనిఫెస్టోలో గత హామీలను పొందుపర్చలేదని, అంటే వాటిని నెరవేర్చే ఉద్దేశం లేదా? అని ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) ప్రశ్నించింది. బీజేపీ మేనిఫెస్టోను ‘అబద్ధాల పత్రం’ అని అభివర్ణించింది. బీజేపీ మేనిఫెస్టోపై ఆ పార్టీ నేత ఆతిశీ స్పందించారు. నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారని, కానీ పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అనే డేటాను సంకల్ప పత్రంలో పొందుపర్చలేదని అన్నారు. దేశంలోని యువత నిరుద్యోగంతో ఆందోళన చెందుతున్నారని, ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ. 300 నుంచి రూ.1200కు పెరిగిందని, పెట్రో ధరలు పెరిగిపోయాయని చెప్పారు. పెరిగిన ధరలతో దేశంలోని ప్రతి కుటుంబం ఇబ్బందులు పడుతున్నదని, మోదీ జుమ్లా పత్రాన్ని ఎవరూ నమ్మరని అన్నారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఊసే లేదు: రాహుల్​గాంధీ

బీజేపీ మేనిఫెస్టోలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఊసే లేదని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ అన్నారు. ‘ఇండియా కూటమి ప్రణాళిక క్లియర్​గా ఉంది. 30 లక్షల ఉద్యోగాలు.. రూ. లక్ష వేతనంతో యువతకు జాబ్​లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సారి నిరుద్యోగులు మోదీ ఉచ్చులో పడరు’ అని పేర్కొన్నారు. యువత కాంగ్రెస్​తో చేతులు కలుపుతుందని, దేశంలో ఉపాధి విప్లవాన్ని సృష్టిస్తామని ట్విట్టర్​లో పోస్ట్ పెట్టారు.