- టీబీజీకేఎస్ లీడర్ల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల శ్రేయస్సు, కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని, ఆయనకు కార్మికుల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక స్థానిక టీబీజీకేఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మన్, పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు సొత్కు సుదర్శన్ మాట్లాడారు.
మందమర్రి ఏరియా కేకే–5 బొగ్గు గనిలోకి దిగిపోయి పనిస్థలాలను పరిశీలిస్తూ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి అండగా నిలిచిన మంత్రి వివేక్ వెంకటస్వామిపై స్థానిక టీబీజీకేఎస్ నేతలు ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. సింగరేణి సంస్థ నష్టాల బాటలోకి వెళ్లిన సమయంలో అప్పటి కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం ఇప్పించి సింగరేణి సంస్థను, లక్షమంది కార్మికులను కాపాడిన విషయం మరవకూడదన్నారు. కార్మికులకు పెన్షన్ పథకం తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి రిటైర్డు కార్మికులకు కనీసం రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని పార్లమెంటులో ప్రస్తావిస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం టీబీజీకేఎస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ పాలనలో సింగరేణిలో ఒక్క కొత్త బొగ్గు గనిని కూడా ప్రారంభించలేదని విమర్శించారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులకు వ్యతిరేకమంటూ అండర్‌గ్రౌండ్ గనుల మూసివేతకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కారణమయ్యారని ఆరోపించారు. 12 గనులు ఏర్పాటు చేస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని కార్మికులను నమ్మించి మోసం చేశారని అన్నారు.
సింగరేణిలో ఒకప్పుడు లక్షమంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం సంఖ్య 38 వేలకే తగ్గిపోవడానికి బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నేతల నిర్వాకమే కారణమని మండిపడ్డారు. కేకే–5 బొగ్గు గనిపై మంత్రి పర్యటన పూర్తికాకముందే స్థానిక టీబీజీకేఎస్ నేతలు మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేస్తూ కార్మికుల ఎదుట అబాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. సింగరేణి కంపెనీ మనుగడ, కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కాకా కుటుంబంపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఇన్‌చార్జి గోపతి బానేశ్, సీనియర్ నాయకులు నర్సింగ్, పవన్, హఫీజ్, సట్ల సంతోష్, ఎర్రరాజు తదితరులు పాల్గొన్నారు.
