
న్యూఢిల్లీ: రైల్వే శాఖను మోదీ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. బెంగాల్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆ ఇద్దరూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ‘‘కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వార్త తెలిసి దిగ్ర్భాంతి చెందా. ఈ ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేండ్లలో రైల్వే శాఖను కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీనిపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం” అని ఖర్గే ట్వీట్ చేశారు.
గత పదేండ్లలో రైల్వే ప్రమాదాలు పెరిగాయని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం, రైల్వే శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. కాంచన్ జంగా రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాహుల్ ఆకాంక్షించారు. ప్రమాదానికి బాధ్యత వహించి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని మరో నేత ప్రమోద్ తివారీ డిమాండ్ చేశారు. రీల్స్ చేసుకుంటూ మంత్రి బిజీగా ఉన్నారని ఫైర్ అయ్యారు. కాగా, ప్రమాదం నేపథ్యంలో 19 రైళ్లను రద్దు చేశారు. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు రూట్లలో ట్రెయిన్లు నడిపేందుకు వీలు కాదని, దీంతో 19 రైళ్లను రద్దు చేశామని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు..
న్యూఢిల్లీ: మన దేశంలో 2023 నుంచి ట్రైన్యాక్సిడెంట్లు ఎక్కువగానే జరిగాయి. గతేడాది జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో దాదాపు 300 మంది చనిపోయారు. 900 మందికి పైగా గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్ప్రస్ బహనాగ బజార్ స్టేషన్లో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్టోబర్ 2023లో విశాఖ - పలాస, విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. బిహార్లోని బక్సర్ జిల్లాలో అక్టోబర్లో ఆనంద్ విహార్ టర్మినల్ - కామాఖ్య జంక్షన్ నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్కు సంబంధించిన ఆరు కోచ్లు పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా 70 మందికి పైగా గాయాలయ్యాయి. ఆగస్టు 2023లో మధురై జంక్షన్లో ఉన్న లక్నో - రామేశ్వరం భారత్ గౌరవ్ రైలులో మంటలు చెలరేడంతో దాదాపు 10 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయాలయ్యా యి. సెప్టెంబరు 2023లో.. మథురలోని షకుర్ బస్తీ నుంచి వెళ్తున్న ఇము రైలు పట్టాలు తప్పింది.