సంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ పదవులపై పీటముడి!

సంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ పదవులపై పీటముడి!

రంగారెడ్డి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ.. తమ వర్గం వారికే ఇవ్వాలని పట్టు

  • సంగారెడ్డి డీసీసీ చీఫ్‌‌గా నిర్మలా జగ్గారెడ్డినే తిరిగి కొనసాగించాలని మెజార్టీ నేతల నిర్ణయం
  • తన అనుచరుడికే ఇవ్వాలంటున్న మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రంగారెడ్డి, సంగారెడ్డి మినహా మిగితా అన్ని  జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ నియమించడంతో.. ఇప్పుడు ఈ రెండింటిపైనే చర్చ నడుస్తున్నది. ఈ జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని హైకమాండ్ ఎందుకు పెండింగ్‌‌లో పెట్టిందనే దానిపై ఆ రెండు జిల్లాల్లోనే కాదు.. పీసీసీలో విస్తృతంగా డిస్కషన్‌‌ కొనసాగుతున్నది.  రంగారెడ్డి జిల్లా దాదాపుగా హైదరాబాద్‌‌ను ఆనుకొని ఉండడం, ఇక సంగారెడ్డి కూడా నగరానికి  కూతవేటు దూరంలో ఉండడంతో సహజంగానే ఈ రెండు జిల్లాలపై అందరి దృష్టి పడింది.  

అనుచరులకోసం ఎమ్మెల్యేల పట్టు..

రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఎవరికీ ప్రాతినిథ్యం లేదు. దీంతో మంత్రి పదవి ఏ సామాజిక వర్గానికి ఇస్తే.. మరో సామాజికవర్గానికి డీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టు అక్కడి నేతలు చెప్పుకుంటున్నారు. 

అలాగే, ఈ జిల్లా నుంచి మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి.. ఇద్దరూ కూడా తమ వర్గం వారి కోసం పట్టుబట్టడం మరో కారణమని  ఆ జిల్లా నేతలు చెబుతున్నారు. 

మధ్యలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా తన అనుచరుల కోసం గట్టి ప్రయత్నం చేస్తుండడంతో.. మూడు ముక్కలాటలో ఈ పదవిని హైకమాండ్ పెండింగ్‌‌లో పెట్టినట్టు చర్చ నడుస్తున్నది.  కాగా, డీసీసీ చీఫ్ పదవి కోసం  రెడ్డి, దళిత సామాజికవర్గాల మధ్య గట్టి పోటీ నెలకొన్నదని స్థానిక నేతలు చెబుతున్నారు. 

ఇద్దరి మధ్య పోటీ..

సంగారెడ్డి డీసీసీ చీఫ్‌‌గా నిర్మలా జగ్గారెడ్డినే తిరిగి కొనసాగించాలని హైకమాండ్‌‌కు పలువురు నేతలు  సూచించారు. అయితే, మంత్రి దామోదర రాజనర్సింహ మాత్రం జహీరాబాద్‌‌కు చెందిన ఓ నాయకుడి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. 

సిట్టింగ్ డీసీసీ అధ్యక్షులను తిరిగి నియమించవద్దని హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకున్నందున.. నిర్మలా జగ్గారెడ్డికి ఈ నిబంధన అడ్డంకిగా మారిందని కొందరు నేతలు అంటున్నారు. అయితే, జగ్గారెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ హైకమాండ్‌‌కు వీర  విధేయుడిగా ఉన్నందున నిర్మల విషయంలో ఈ నిబంధనను పక్కనపెట్టాలని, పార్టీలో సీనియర్ నేత అయిన జగ్గారెడ్డి పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించాలని రాష్ట్ర, జాతీయ నాయకత్వాన్ని సంగారెడ్డి జిల్లా నేతలు  కోరుతున్నారు.  

వచ్చే నెలలోనే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నందున జిల్లాలో పార్టీ నేతలను సమన్వయం చేసి, కాంగ్రెస్‌‌ను గెలుపు బాటలో నడిపించేందుకు వెంటనే డీసీసీ అధ్యక్షులను నియమించాలని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.