మహేశ్ గౌడ్‌‌కు ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్ నేతల డిమాండ్

మహేశ్ గౌడ్‌‌కు ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలి :  కాంగ్రెస్ నేతల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్, నేతలు ఈరవత్రి అనిల్, మెట్టు సాయికుమార్ డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎంపీ అర్వింద్ ఉపయోగించిన నీచమైన భాషకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. బీసీ నేత అయిఉండి, మరో బీసీ నేత అయిన మహేశ్ గౌడ్‌‌ను అర్వింద్ విమర్శించిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజకీయ ప్రత్యర్థులపై చేసే విమర్శలు హూందాగా ఉండాలి తప్ప, ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోసారి అర్వింద్ ఇలాంటి వ్యాఖ్యలే పునరావృతం చేస్తే.. ఆయన్ను హైదరాబాద్, నిజామాబాద్‌‌లలో తిరగనీయమని హెచ్చరించారు. మహేశ్ గౌడ్‌‌పై చేసిన వ్యాఖ్యలను అర్వింద్ వెంటనే వెనక్కి తీసుకొని, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అర్వింద్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడు రాజకీయ సంస్కృతికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి మాటలతో నేతలు ప్రజల్లో చులకనైపోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా అర్వింద్ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తన తప్పును ఒప్పుకోవాలని స్పష్టం చేశారు. లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఖాయమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు