- హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరిన ఎంపీ రఘునందన్ రావు
- న్యాయమూర్తికి రాతపూర్వక ఫిర్యాదు అందజేత
హైదరాబాద్, వెలుగు: అధికార, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఆస్తులపై వెంటనే విచారణ జరపాలని బీజేపీ ఎంపీ ఎం.రఘునందన్ రావు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ నాయకులకు మధ్య నడుస్తున్న ఆస్తుల పంచాయతీ, పరస్పర ఆరోపణల వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం హైకోర్టు ప్రారంభమయ్యే సమయానికి రాతపూర్వక ఫిర్యాదును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు ఆయన తెలిపారు.
అక్టోబర్ 2న తాను ఇచ్చిన మాటకు కట్టుబడి, పత్రికల్లో వచ్చిన ఆరోపణల వివరాలు, తర్జుమా చేసిన పత్రాలను ఈ ఫిర్యాదుకు జతపరిచామని, దీన్ని పిల్ రూపంలో లేదా విచారణ రూపంలో కానీ వెంటనే స్వీకరించాలని కోరినట్లు చెప్పారు. సీఎంకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య జరుగుతున్న ఆస్తుల పంచాయతీ గురించి విచారణ జరిపించమని ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే స్వయంగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిశానని తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్లు కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్ష కోట్లు, రెండున్నరేండ్లలో సీఎం రేవంత్ రెడ్డి సంపాదించిన యాభై వేల కోట్లపై స్పష్టత రావాలన్నారు. అటు కేసీఆర్ కుటుంబం, ఇటు సీఎం కుటుంబం ఎన్నికల అఫిడవిట్లలో చూపిన దానికన్నా ఎక్కువ ఆస్తులు ఉంటే వెంటనే గుర్తించి విచారణ జరపాలని కోరారు.
ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు సీఎం కుటుంబం, మెడికవర్ ఆస్పత్రి, పాఠశాలలు, ఇతర వ్యాపారాలపై నిజానిజాలు బయటపెట్టాలని పేర్కొన్నారు. మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపిస్తానని తెలిపారు. నాయకులు అక్రమంగా సంపాదించిన సొమ్మును బయటపెట్టి ఆ మొత్తాన్ని ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.
