- సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం
- నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయ శాఖ
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ జడ్జి జస్టిస్ పి. శ్యామ్ కోశి నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ శ్యామ్ కోశి నియామకానికి ఆమోదం తెలపగా, కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియామక ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ఆయన సోమవారమే హడావుడిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.
సాధారణంగా ప్రధాన న్యాయమూర్తి బదిలీ లేదా పదోన్నతిపై వెళ్లే సమయంలో హైకోర్టులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అయితే, సుప్రీంకోర్టు నియామక ఉత్తర్వులు అత్యవసరంగా వెలువడటంతో జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఎలాంటి ఫేర్‌వెల్ కార్యక్రమం లేకుండానే సీజేగా రిలీవ్ కావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చోటుచేసుకోలేదు. తెలంగాణ హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.
అపరేశ్ కుమార్ రిలీవ్..
జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌తో పాటు గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలను కూడా సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించారు. 1965 జులై 7న జన్మించిన అపరేశ్ కుమార్ సింగ్ 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకుని పాట్నా, ఝార్ఖండ్ హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2012 జనవరి 24న ఝార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2014 జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2022 డిసెంబర్ 20 నుంచి 2023 ఫిబ్రవరి 19 వరకు ఝార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2025 జులై 19న బదిలీపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను చేపట్టారు.
