35 మంది ‘నకిలీ’ జేఎల్స్ ఔట్..ఫేక్ సర్టిఫికెట్లతో కొలువులు చేస్తున్న వారిపై వేటు

35 మంది ‘నకిలీ’ జేఎల్స్ ఔట్..ఫేక్ సర్టిఫికెట్లతో కొలువులు చేస్తున్న వారిపై వేటు
  •  ఇతర రాష్ట్రాల నుంచి బోగస్ పీజీ పట్టాలతో మోసం
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో బయటపడ్డ బాగోతం
  • విచారణ జరిపి సర్వీస్ నుంచి తొలగించిన ఇంటర్ విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: నకిలీ సర్టిఫికెట్లతో దొడ్డిదారిన సర్కారు ఉద్యోగాలు చేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 

ఇతర రాష్ట్రాల నుంచి బోగస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు సమర్పించి ఇంటర్‌‌‌‌ లెక్చరర్‌‌‌‌ కొలువులు పొందిన 35 మంది జూనియర్ లెక్చరర్లను (జేఎల్) సర్వీస్ నుంచి తొలగించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ ఒక్కొక్కరికి ఆర్డర్స్ పంపించారు. అపాయింట్ మెంట్ ఆర్డర్స్ రద్దు చేస్తున్నట్టు ఆర్డర్స్ లో పేర్కొన్నారు. 

తీగలాగితే కదిలిన డొంక

గత ప్రభుత్వం 2014 కు ముందు నుంచే కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న సుమారు 3,300 మందిని 2023లో రెగ్యులరైజ్ చేసింది. రెండో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో భాగంగా.. ఇతర రాష్ర్టాలకు చెందిన 16 యూనివర్సిటీల పరిధిలో దాదాపు 600 మంది దాకా చదివినట్టు గుర్తించారు. వీరిలో రెగ్యులర్ మోడ్, డిస్టెన్స్ మోడ్ లోనూ స్టడీస్ చేసినట్టు సర్టిఫికెట్లు పెట్టారు.

 ఈ క్రమంలో వారి ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిన అధికారులు షాకింగ్ నిజాలు కనుగొన్నారు. వారంతా బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి పీజీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. 

ఇతర రాష్ర్టాల సర్టిఫికెట్లపై అనుమానం వచ్యిన ఇంటర్ విద్యాశాఖ.. నేరుగా ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాసింది. దీంతో పాటు ప్రత్యేక బృందాలను పంపి విచారించింది. ఆ సర్టిఫికెట్లన్నీ బోగస్‌‌‌‌ అని తేలడంతో ఈ భారీ మోసం వెలుగు చూసింది.

కోర్టు కేసులు.. షోకాజ్ నోటీసులు

ఫేక్ సర్టిఫికెట్ల విషయమై ఆగస్టు నెలలోనే ఆయా లెక్చరర్లకు ఇంటర్ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. తొలుత కొందరు జూనియర్ లెక్చరర్లు సాంకేతిక లోపాలను సాకుగా చూపుతూ హైకోర్టును ఆశ్రయించారు. 

న్యాయస్థానం సూచనలు, నిబంధనల మేరకు ఇంటర్ కమిషనరేట్ మరోసారి వారికి స్పష్టమైన అవకాశమిస్తూ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ విధించి కొత్తగా నోటీసులు జారీ చేసింది. అధికారులు ఇచ్చిన గడువులోగా సదరు లెక్చరర్లు తమ వివరణ సమర్పించినప్పటికీ.. ఆయా యూనివర్సిటీల నుంచి పెట్టిన సర్టిఫికెట్లు నకిలీవిగా తేలడంతో 35 మంది లెక్చరర్లపై వేటు వేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లతో ఇంకెవరైనా కొనసాగుతున్నారా కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. 

మార్కులు వెరిఫికేషన్ చేయిస్తే..

జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌ లో పక్క రాష్ట్రాల సర్టిఫికెట్లపైనే ఆఫీసర్లు ఫోకస్ పెడుతున్నారు. మన రాష్ట్ర వర్సిటీల సర్టిఫికెట్ల విషయంలో కేవలం ‘ఫస్ట్, సెకండ్ డివిజన్’లకే పరిమితమై అసలైన మార్కుల లెక్కను గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్జేడీల ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఒక్క మార్కుతోనే ఉద్యోగాలు తారుమారైన నేపథ్యంలో.. అప్పట్లో కొందరు మార్కులు మార్చుకుని కొలువులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత తనిఖీల్లో ఆర్జేడీ ఆఫీసుల్లోని రికార్డులతో మార్కులను సరిపోల్చి చూసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. 

కేవలం డీడీలు కట్టించుకుని మొక్కుబడి జెన్యూనిటీ రిపోర్టులు తెప్పించుకుంటున్నారే తప్ప, ఉద్యోగ నియామకాలకు అత్యంత కీలకమైన అసలు మార్కుల వివరాలను చెక్ చేయకపోతే ఈ వెరిఫికేషన్ ఉద్దేశమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బోర్డు ఉన్నతాధికారులు స్పందించి మార్కులతో కూడిన సమగ్ర రిపోర్టులను తెప్పించి అసలైన అర్హులను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.