కాంగ్రెస్ గెలవలేదు.. మేం ఓడిపోయాం: ప్రశాంత్ రెడ్డి

కాంగ్రెస్ గెలవలేదు.. మేం ఓడిపోయాం: ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదని.. తాము ఓడిపోయామని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ప్రసాదించామంటూ సీఎం మాట్లాడుతున్నారని, ఆయన స్వయంగా ఒక్కరోజే ప్రజా దర్బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారని, ఆ తర్వాత ప్రజలను కలిసిందే లేదన్నారు. వారానికి రెండ్రోజులు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నా ఒక్క మంత్రి కూడా దానికి హాజరు కావడం లేదన్నారు. 

నెల రోజులుగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో ఎంత మంది సమస్యలు పరిష్కరించారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి బస్సు సర్వీసుల సంఖ్య తగ్గించారని, మరోవైపు ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి భిక్షాటన చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెద్దపెద్ద పరిశ్రమలు రాష్ట్రం దాటిపోయాయని ఆరోపించారు. 

నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. అయితే, జిల్లాల సంఖ్య తగ్గిస్తామంటూ రేవంత్ రెడ్డి ఫ్యూడల్ ఆలోచనలు బయటకు తెస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సీఎం అయిన నెల రోజుల్లోనే ఆరుసార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఎంత బలహీనమైన సీఎం అనేది ఈ పర్యటనలతో తేలుతోందని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.